Surprising Snake Fact Check : కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న వీడియో యొక్క అసలు నిజమెంతో నిగ్గుతేలింది. క్రికెట్ గోల తట్టుకోలేక ఒక యువకుడు షేర్ చాట్ లో నుండి డౌన్లోడ్ చేసుకుని ఫేక్ వీడియో తయారుచేసి ఇందిరా నగర్ కాలనీ వాసులకు షేర్ చేయడంతో ఇది కాస్తా.. వైరల్ అయిందని కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఆ ఫేక్ వీడియో తయారు చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెల్లడైందని చెప్పారు. మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నామని మరోసారి ఈ విధంగా రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఆ యువకుడ్ని స్టేషన్ నుంచి పంపించేశారు రామడుగు ఎస్ఐ. ఇదిలా ఉండగా, ఓ వింత పాము జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామం ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తోందని, ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలోని గ్రూపుల్లో వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.
ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్లలో చర్చనీయాంశం అయింది. ఇదంతా అబద్దమని స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో ‘హోంగోస్ హిట్స్ ద హై నోట్స్’ అనే పేరుతో అప్‌లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు.
ఆ వీడియోను వెలిచాల గ్రామంలోనిదిగా పేర్కొంటూ ఈ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని ఎస్ఐ చెప్పారు. సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఫేక్ వీడియో అని తేటతెల్లమైందని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామడుగు పోలీసులు తెలిపారు.