AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన ఘటన.. వ్యక్తిని కాపాడేందుకు వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు వీడియో

అరుదైన ఘటన.. వ్యక్తిని కాపాడేందుకు వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు వీడియో

Samatha J
|

Updated on: Sep 04, 2025 | 12:38 PM

Share

సాధారణంగా రైలు ముందుకే నడుస్తుంది. వెనక్కి నడవడం అనేది చాలా అరుదు. కానీ ఈ అరుదైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. రైలు నుంచి కిందపడిపోయిన ఒక ప్రయాణికుడి ప్రాణాలు కాపాడేందుకు రైలు ఏకంగా కిలోమీటరున్నర దూరం వెనక్కి ప్రయాణించింది. ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విషాదకరమైన విషయం ఏంటంటే మానవతా దృష్టితో రైల్వే సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం యలహంకకు బయలుదేరాడు. సోమవారం సాయంత్రం వీరంతా గూడూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు ప్రకాశం జిల్లాలోని గద్దలకొండ స్టేషన్ దాటిన తర్వాత అందరూ భోజనం చేశారు. హరిబాబు భోజనం అనంతరం చేతులు కడుక్కోవడానికి వాష్‌మెషిన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఖాళీ లేకపోవడంతో డోర్ దగ్గర నిల్చున్నాడు. ఈ సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపులకు గురైంది. బలమైన కుదుపు రావడంతో హరిబాబు అదుపుతప్పి రైలు నుంచి కిందపడిపోయాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అతని స్నేహితులకు విషయం చెప్పి చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే రైలు కిలోమీటరున్నర దూరం వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న లోకో పైలట్లు ఉన్నతాధికారులతో మాట్లాడి గుంటూరు రైల్వే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని రైలును పట్టాలపై వెనక్కు నడిపి రైలు పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్న హరిబాబును గుర్తించారు. వెంటనే అతన్ని రైలులో ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హరిబాబు చనిపోయాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

భారీ వర్ష సూచన..వచ్చే 24 గంటల్లో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం వీడియో

Published on: Sep 04, 2025 11:55 AM