AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖతర్నాక్‌ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో

ఖతర్నాక్‌ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో

Samatha J

|

Updated on: Apr 04, 2025 | 8:36 PM

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చోరకళలో రోజు రోజుకీ డెవలప్‌ అవుతున్నారు. కొత్త కొత్త ఎత్తులతో అమాయకులను బకరాలను చేసి దోచేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు దుండగులు ఓ వ్యక్తికి రోడ్డుమీద 100 రూపాయలు చూపించి.. అతని బైకులోనుంచి లక్షన్నర కొట్టేసి పారిపోయారు. ఆ తర్వాత విషయం గ్రహించి లబోదిబోమంటూ ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎస్బిహెచ్ బ్యాంక్ నుంచి శ్రీహరి అనే వ్యక్తి తన సొంత అవసరాల కోసం 1,50,000లు డ్రా చేసుకున్నారు. తన ద్విచక్ర వాహనంలో ఈ డబ్బులను పెట్టుకున్నాడు. ఇదంతా కొందరు వ్యక్తులు గమనించారు. శ్రీహరి బ్యాంకుకు వెళ్లడం.. డబ్బు డ్రా చేయడం.. అది తీసుకొచ్చి అతని బైక్‌లో పెట్టుకోవడం అన్నీ పరిశీలించారీ కేటుగాళ్లు. శ్రీహరి కూడా బ్యాంకు నుంచి బయటకు వచ్చి చుట్టూ ఏమీ గమనించలేదు.

 అక్కడున్నవారంతా బ్యాంకుకు వచ్చిన కస్టమర్లే అనుకొని మామూలుగా డబ్బు సంచి బైకులో పెట్టుకొని బయలుదేరబోయాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరకి వచ్చారు. ఓ వ్యక్తి కొంచెం దూరంగా ఉండి ఫోన్‌ మాట్లాడుతున్నట్టు యాక్ట్‌ చేశాడు. మరో వ్యక్తి శ్రీహరి దగ్గరకు వచ్చి అక్కడ రూ.100లు పడి ఉన్నాయి.. మీవేనేమో చూసుకోండి అని చెప్పాడు. అటు తిరిగి చూసిన శ్రీహరి తనదే అయి ఉంటుంది అని నోటు తీసుకోడానికి అటు వంగగానే.. శ్రీహరి బైకుకి అవతల ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి శ్రీహరి బైక్‌పైన పెట్టిన డబ్బు సంచి తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మరో వ్యక్తి బైక్‌ స్టార్ట్‌ చేసుకొని రెడీగా ఉన్నాడు. డబ్బు సంచితో ఆ ఇద్దరూ అక్కడి నుంచి బైక్‌ పై పారిపోయారు. ఇటువైపు ఉన్న మరో ఇద్దరు వంద నోటు ఆ పక్కనే ఉన్న బైక్‌ కింద ఉంది చూడండి అని శ్రీహరికి చెప్పారు. ఆయన అటు తిరగ్గానే.. వీళ్లిద్దరూ కూడా బైక్ పై ఉడాయించారు. అక్కడ నోటు ఏమీ కనిపించకపోయేసరికి శ్రీహరి తిరిగి తన బైక్‌ దగ్గరకు వచ్చాడు. కానీ ఆయనకు తన డబ్బు సంచి కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలా శ్రీహరి రూ.100ల కోసం చూసుకొని లక్షన్నర పోగొట్టుకున్నాడు. పోలీసులు.. బ్యాంకుకు సంబంధించిన సీసీ కెమెరాలతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో దొంగల బాగోతం మొత్తం బయటపడింది. ఆ రికార్డులు స్వాధీనం చేసుకొని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈమధ్య బ్యాంకు సమీపంలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోతున్నాయని.. జాగ్రత్త గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో

అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో

చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

Published on: Apr 04, 2025 08:36 PM