పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
నిన్న మొన్నటి వరకూ రాజస్థాన్‌లో ఓ మారుమూల గ్రామంలో ఇరుకు ఇంట్లో ఉండే పన్నెండేళ్ల అమ్మాయి. చాలా సాదాసీదాగా సాగుతున్న ఆమె లైఫ్‌లో ఊహించని మలుపు ఒకటి వచ్చింది. ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే చోటులో ఉన్న ఈ బాలిక ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆమె టాలెంట్‌ని చూసి వారెవ్వా అనని వాళ్లు లేరు. ఇదంతా జరిగింది ఎవరి వల్లో తెలుసా..? క్రికెట్ గాడ్‌గా మనం చెప్పుకునే సచిన్ టెండూల్కర్ వల్ల. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది.
పదేళ్ల సుశీలా మీనా బౌలింగ్ వీడియో ఇది. పర్‌ఫెక్ట్ లైన్ అండ్ లెంథ్‌తో…ఓ ప్రొఫెషనల్ బౌలర్‌లా కనిపించింది సుశీల. ఆమె బౌలింగ్ యాక్షన్ కూడా మామూలుగా లేదు. అందరూ ఫిదా అయింది ఈ యాక్షన్‌కే. పైగా అది లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్. ఈ వీడియో షేర్ చేస్తూ సచిన్ టెండూల్కర్ ఆమెని తెగ పొగిడాడు. అంతే కాదు. పేస్ బౌలర్ జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్‌తో పోలుస్తూ…ఈ పోస్ట్‌కి జహీర్‌ని కూడా ట్యాగ్ చేశాడు. ఆ తరవాత జహీర్ కూడా షేర్ చేయడం వల్ల ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఇలా ఒక్కరోజులో సుశీలా మీనా ఇంటర్నెట్ స్టార్ అయింది. సుశీలా మీనా. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో రమేర్ తలబ్ అనే ఓ గ్రామానికి చెందిన బాలిక. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన సుశీల..ఓ వైపు చదువుకుంటూనే క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని కొనసాగిస్తోంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ..గంటకి 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నేర్చుకుంది. ఇదిగో ఈ ట్యాలెంటే.. ఇప్పుడామెని చాలా స్పెషల్‌గా నిలబెట్టింది. సచిన్ టెండూల్కర్ ఆమె ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా..? సుశీలాకి సచిన్ అంటే ఎవరో తెలియదు. ఇంట్లో టీవీ లేదని, ఎప్పుడూ క్రికెట్ కూడా చూడలేదని చెబుతోంది. ఆమెకి తెలియని వ్యక్తే..ఆమె గురించి ప్రపంచమంతా తెలిసేలా చేయడం అంటే..చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అదే ఇంటర్నెట్ మహత్యం.