Ramam Raghavam Review: రామం రాఘవం మూవీ రివ్యూ.. జబర్దస్త్ ఫేమ్ ధన్‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే?

బలగం ఫేమ్ వేణు యల్దండి బాటలోనే మరో జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ దర్శకుడిగా మారాడు. అతని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం రామం రాఘవం. సముద్రఖని లాంటి సీనియర్ నటుడు ఈ సినిమాలో నటించడంతో మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. మరి తండ్రీ కొడు కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ రామం రాఘవం సినిమా ఎలా ఉందో అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

దశరథ రామం (సముద్రఖని) రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే ఓ సిన్సియర్‌ అధికారి. నీతి, న్యాయంగా ఉంటాడు. లంచం తీసుకోడు, ఎలాంటి ప్రలోభాలకు లొంగడు. ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాఘవ (ధన్‌రాజ్‌). చిన్నప్పటి నుంచి కొడుకు అంటే ప్రాణం. కానీ రాను రాను పెరుగుతున్న కొద్దీ పరమ బేవార్స్‌గా మారిపోతాడు కొడుకు రాఘవం. అది చూసి తండ్రిగా బాధ పడుతుంటాడు రామం. అంతే కాదు పెళ్లి చేసుకుంటే చాలు కట్నం వస్తుంది.. అలా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే మెంటాలిటీ రాఘవది. దాంతో పాటు జీవితంలో ఒకదాని వెంట మరో తప్పులు చేస్తూనే ఉంటాడు రాఘవ. కొడుకు తీరు చూసి రామం కూడా విసిగిపోతాడు. కొడుకును మార్చాలని తిడతాడు, కొడతాడు కానీ బుద్ది రాదు. చివరికి తండ్రి సంతకాన్నే పోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో తండ్రే కొడుకును పోలీసులకు అప్పగిస్తాడు. అయినా మారకపోగా.. ఏకంగా తన తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ. లారీ డ్రైవర్‌ అయిన స్నేహితుడు (హరీష్‌ ఉత్తమన్‌)తో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్‌ చేస్తాడు. అసలు తన తండ్రి అంటే ఎందుకు రాఘవకు అంత కోపం.. చంపేంత తప్పు ఆ తండ్రి ఏం చేసాడు..? చివరికి తండ్రి గొప్పతనం కొడుకు తెలుసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ..