Viral: నుదిటిపై మొటిమ.. నెలల తరబడి అలానే ఉంది.. ఆస్పత్రిగా వెళ్లగా షాక్..
ముఖంపై మొటిమలు వస్తుండటం.. పోతుండటం కామన్.. కానీ ఏదైనా మొటిమ నెలల పాటు అలా ఉంటే.. హా.. ఏముందులే అని లైట్ తీసుకోకండి.. అది ప్రమాదకర క్యాన్సర్ కావొచ్చు. తాజాగా అలాంటి కేసు ఒకటి వెలుగుచూసింది.
అందంగా కనిపించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొద్దిమందిని స్కిన్ కండీషన్, మేకప్, పొల్యూషన్, హర్మోన్ సమస్యల కారణంగా మొటిమలు వెంటాడుతూ ఉంటాయి. కొంతకాలానికి అవే నయమవుతాయి. అయితే అలాంటి ఓ మొటిమ క్యాన్సర్‌గా టర్న్ అవుతుందంటే మీరు నమ్ముతారా..? అదే జరిగింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం… రాచెల్ ఒలివియా అనే 32 ఏళ్ల మహిళ, మొదట్లో తన నుదిటిపై ఉన్న చిన్న ఎరుపు రంగు కురుపును మొటిమగా భావించింది. అయితే ఎంత కాలం గడిచినా ఆ మొటిమ తగ్గలేదు. పైగా అది వచ్చిన ప్రదేశంలో చర్మం పొరలు పొరలుగా మారడంతో.. రాచెల్ డాక్టర్లను సంప్రదించింది. బయాప్సీ రిపోర్ట్‌లో ఆమెకు చర్మ క్యాన్సర్ ఉన్నట్లు షాకింగ్ విషయం వెల్లడించింది. రాచెల్ మాట్లాడుతూ, “నేను దాన్ని మొటిమగా భావించి ఒక సంవత్సరం పాటు వదిలేశాను. కానీ అది నయం కాలేదు. డాక్టర్ల వద్దకు వెళ్లగా బయాప్సీ చేసి క్యాన్సర్ అని నిర్ధారించారు” అని ఆమె తెలిపారు.
బేసల్ సెల్ కార్సినోమాగా పిలువబడే.. ఈ చర్మ క్యాన్సర్ చర్మం పై పొరలో ఉండే ఎపిడెర్మిస్‌లోని బేసల్ కణాల DNA దెబ్బతినడం వల్ల వస్తుందని డాక్టర్లు తెలిపారు. బేసల్ సెల్ కార్సినోమా (BCC) సాధారణంగా మైనపు ముద్ద మాదిరిగా తెల్లటి లేదా గోధుమ పొలుసుల పాచ్‌గా కనిపిస్తుందని వెల్లడించారు. ముఖంపై ఇలాంటివి కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలన్నారు. ఇది తీవ్రరూపంగా మారితే మెలనోమా మారుతుందని.. అది చర్మ క్యాన్సర్ అత్యంత తీవ్రమైన రూపమని చెప్పారు. రాచెల్ బేసల్ సెల్ కార్సినోమాకు చికిత్స పొందుతున్నందున, ఆమె తన బిడ్డను చూసుకుంటూ తన లైఫ్ లీడ్ చేయడంతో సవాళ్లను ఎదుర్కొంటుంది.