పిల్లలను కాపాడేందుకు ఓ మహిళ తీవ్ర ప్రయత్నం… గుండెలు బద్దలయ్యే వివరాలు
అప్పటిదాకా ఏసీలో చల్లగా కునుకుతీస్తున్న శరీరాలకు ఒక్కసారిగా వేడితగిలింది. కళ్లు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించనంత దట్టమైన పొగ. ప్రమాదం జరిగిందని అర్ధమైంది. కానీ బయటపడే దారిలేదు. అంతటి భయానక పరిస్థితుల్లోనూ పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరిక్షణందాకా ప్రయత్నించింది. విధి ఆడిన వింతనాటకంలో చివరికి నిస్సహాయంగా...

అప్పటిదాకా ఏసీలో చల్లగా కునుకుతీస్తున్న శరీరాలకు ఒక్కసారిగా వేడితగిలింది. కళ్లు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించనంత దట్టమైన పొగ. ప్రమాదం జరిగిందని అర్ధమైంది. కానీ బయటపడే దారిలేదు. అంతటి భయానక పరిస్థితుల్లోనూ పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరిక్షణందాకా ప్రయత్నించింది. విధి ఆడిన వింతనాటకంలో చివరికి నిస్సహాయంగా ప్రాణాలొదిలింది.
17మంది మృతుల్లో 8మంది చిన్నారులే. పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు. ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్నీ పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో! గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటపడిందీ విషాద దృశ్యం.
పొగ, మంటలతో నిండిన ఆ ఇంటి మొదటి అంతస్తులో కనిపించింది మహిళ మృతదేహం. కానీ తను ఒంటరిగా లేదు. ఆమె చేతుల్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఓ పసికందు. మొబైల్ టార్చ్ వెలుగులో బయటపడేందుకు మార్గమేదయినా దొరుకుతుందని ఆ మహిళ చివరిదాకా ప్రయత్నించింది. ఓవైపు మంటలు, మరోవైపు పొగతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ నలుగురు పిల్లలనూ పొదివి పట్టుకుంది. చివరిశ్వాసదాకా బయటపడతామనే ఆశతో అలాగే ఉండిపోయిందా మహిళ. పిల్లలతో సహా మంటలకు ఆహుతైపోయింది.
ప్రమాదం జరగ్గానే స్థానిక యువకులు ఇంటి గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మొదటి అంతస్తుకు చేరుకున్నప్పుడు.. నలుగురు పిల్లలను దగ్గరికి హత్తుకుని చనిపోయి ఉన్న ఆ మహిళను చూసి షాక్ తిన్నారు. వారిలో ఎవరూ ప్రాణాలతో లేకపోవటంతో వెంటనే వారిపై షీట్ కప్పారు. 17మంది బాధితుల్లో ఆ బాధితురాలు ఒకరు. ఆమె ఎవరు, ఆ పిల్లలు ఆమెకు ఏమవుతారనేది కాదు. తల్లిప్రేమ ఎంత గొప్పదో కళ్లకు కట్టిన విషాద దృశ్యం అది. ఇదికేవలం విషాదగాథ కాదు.. కొండంత ప్రేమను పంచే ఓ అమ్మ కథ. యథార్థవ్యథ.