
మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతిలో భయంకరమైన నేరపూరిత ఘటన వెలుగు చూసింది. నిత్యం శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్న భర్తను హతమార్చేందుకు ఓ భార్య వేసిన ప్లాన్ తలకిందులైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను పోలీసులు కాపాడగా, నిందితురాలైన భార్యను అరెస్ట్ చేశారు. ఘటన నేపథ్యం పరిశీలించగా,..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బారామతిలోని ఒక ప్రముఖ నివాస ప్రాంతంలోని ఫ్లాట్‌లో ప్రవీణ్ జగతాప్, ఆయన భార్య షర్మిలా జగతాప్ నివసిస్తున్నారు. దంపతుల మధ్య చాలా కాలంగా తీవ్ర మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. బి.ఫార్మసీ పూర్తి చేసిన షర్మిలను ఉద్యోగం చేయనివ్వకుండా, ఇంట్లో నిత్యం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని ఆమె తెలిపింది. తనను మాత్రమే కాకుండా పిల్లలను కూడా భర్త కొట్టేవాడని, ఇంట్లో పనిచేసే మనిషిలా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వేధింపులతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన షర్మిల, భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ముందుగానే పక్కా వ్యూహం రచించింది. షర్మిలకు గార్డెనింగ్ చేయడం పట్ల ఎక్కువ ఆసక్తి. దాంతో ఫ్లాట్ బాల్కనీలో మొక్కలు నాటేందుకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాంటర్ కట్టడాన్ని సిమెంట్‌తో చేయించింది. పథకం ప్రకారం.. భర్తకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి, స్పృహతప్పి పడిపోయాక క్రికెట్ బ్యాట్‌తో తలపై తీవ్రంగా దాడి చేసింది. అతడు చనిపోయాడని భావించి, బాల్కనీలోని సిమెంట్ కట్టడంలో పెట్టి పైన మట్టితో కప్పేసింది.
భర్తను మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత, దానిపై టైల్స్ వేసి ఏమీ తెలియనట్లు ఉండాలని ప్లాన్ చేసింది. అందుకోసం ఒక భవన నిర్మాణ కార్మికుడిని ఫ్లాట్‌కు పిలిపించింది. అయితే, ఆ ప్రదేశాన్ని చూసిన కార్మికుడికి ఏదో తేడాగా అనిపించి అనుమానం వచ్చింది. వెంటనే అతడు స్థానిక బారామతి పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మట్టిని తొలగించి చూడగా ప్రవీణ్ జగతాప్ స్పృహతప్పిన స్థితిలో ప్రాణాలతో ఉన్నాడు. పోలీసులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం షర్మిల జగతాప్‌ను అరెస్ట్ చేసి విచారించగా, ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..