AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సడెన్‌గా పాము ఎదురైతే ఏం చేయాలి..? మీ ప్రాణాలు కాపాడే టిప్స్ ఇవే..

ఇంట్లో ఉన్నప్పుడో లేదా ఆరుబయట తిరుగుతున్నప్పుడో.. హఠాత్తుగా ఎదురుగా నాగుపాము కనిపిస్తే ఏం చేస్తాం? భయంతో కేకలు వేయడమో, రాళ్లు విసరడమో, పరుగులు పెట్టడమో సహజం. కానీ ఆ కంగారులో మనం చేసే చిన్న తప్పే ప్రాణాల మీదకు తెస్తుందని మీకు తెలుసా? ఎప్పుడైనా పాము ఎదురైతే వెంటనే ఏం చేయాలి? ఎలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సడెన్‌గా పాము ఎదురైతే ఏం చేయాలి..? మీ ప్రాణాలు కాపాడే టిప్స్ ఇవే..
What To Do If You Encounter A Snake
Krishna S
|

Updated on: Oct 25, 2026 | 7:32 PM

Share

కాలంతో నిమిత్తం లేకుండా నివాస ప్రాంతాలు, తోటలు, పొలాలు లేదా వాహనాల కింద పాములు సంచరించడం తరచూ చూస్తుంటాం. ఆహారం, వెచ్చదనం లేదా ఆవాసం కోసం అవి మానవ ఆవాసాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా నాగుపాము, కట్లపాము లాంటి విషసర్పాలు కంటికి కనిపిస్తే ఎంతటి ధైర్యవంతులైనా ఒక్క క్షణం భయంతో వణికిపోవడం సహజం. అయితే అటువంటి క్లిష్ట సమయాల్లో భయాందోళనతో చేసే చిన్న చిన్న తప్పిదాలే ప్రాణాల మీదకు తెస్తుంటాయి. పాము కనిపిస్తే ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా ఏ పాము కూడా మనుషులను వెతుక్కుంటూ వచ్చి కాటు వేయదు. అవి మానవ సంచారానికి దూరంగా ఏకాంతంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తాయి. కేవలం వాటికి ప్రాణహాని ఉందని భావించినప్పుడు, లేదా పొరపాటున మనం వాటిపై అడుగు వేసినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం దాడి చేస్తాయి. అందువల్ల పామును చూడగానే కేకలు వేయడం, రాళ్లు విసరడం, కర్రలతో కొట్టడం వంటివి అస్సలు చేయకూడదు. అటువంటి కదలికలు పామును మరింత రెచ్చగొట్టి దాడి చేసేలా చేస్తాయి.

ఎదురుపడినప్పుడు వెంటనే ఏం చేయాలి?

పాము ఎదురుపడగానే హఠాత్తుగా కేకలు వేస్తూ పరుగెత్తకూడదు. పాము వైపే చూస్తూ చాలా నెమ్మదిగా, శబ్దం చేయకుండా వెనకడుగు వేస్తూ సురక్షిత దూరానికి చేరుకోవాలి. పాము ఇంట్లోకి లేదా గదిలోకి ప్రవేశిస్తే దాన్ని కర్రలతో తరిమివేయడానికి ప్రయత్నించవద్దు. అది బయటకు వెళ్లేందుకు వీలుగా ప్రధాన ద్వారాలు లేదా కిటికీలు తెరిచి ఉంచి, దానికి మార్గం ఇవ్వాలి. పామును సొంతంగా బంధించే సాహసాలు చేయకుండా వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్లు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. పాము ఎదురుపడగానే మొబైల్ కెమెరాలు ఆన్ చేసి క్లోజప్‌లో ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం తీవ్ర ప్రమాదకరం. పిల్లలు, పెంపుడు జంతువులను ఆ ప్రాంతం నుంచి వెంటనే దూరంగా తరలించాలి.

ఇంటి పరిసరాల్లో నిరంతరం పాటించాల్సిన జాగ్రత్తలు

ఇంటి చుట్టూ ఎండు కట్టెలు, పాత ఇటుకలు, రాళ్ల కుప్పలు, తుక్కు సామాన్లు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇవి పాములు దాక్కోవడానికి అనువైన ఆవాసాలుగా మారతాయి. ఎలుకలు, కప్పలు పాములకు ప్రధాన ఆహారం. ఇంట్లో లేదా పరిసరాల్లో ఎలుకల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే పాములు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ప్రధాన తలుపుల కింద ఉండే ఖాళీలు, డ్రైనేజీ పైపుల చుట్టూ ఉండే సందులు, వెంటిలేటర్ మెష్‌లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

రాత్రి వేళల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

చీకటి సమయాల్లో బయటకు నడిచేటప్పుడు ఖచ్చితంగా టార్చ్‌లైట్ ఉపయోగించాలి. చీకట్లో చెప్పులు లేకుండా అస్సలు నడవకూడదు. ఇంటి బయట వదిలేసిన బూట్లు, చెప్పులను ధరించే ముందు వాటిని బోర్లించి దులిపి చూసుకోవాలి. అలాగే బైక్ హెల్మెట్లు, కార్ల ఇంజిన్ కంపార్ట్‌మెంట్లను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఒకవేళ పాము కాటు వేస్తే ఏం చేయాలి?

పాము కాటు వేసినప్పుడు తొలి గంట అత్యంత కీలకం. మూఢనమ్మకాలతో సమయాన్ని వృథా చేయకూడదు.

బాధితుడిని ప్రశాంతంగా ఉంచండి: భయం, ఆందోళన వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి విషం శరీరంలోకి వేగంగా వ్యాపిస్తుంది. బాధితుడికి ధైర్యం చెప్పి స్థిరంగా కూర్చోబెట్టాలి.

అవయవాన్ని కదపవద్దు: కాటు పడిన కాలు లేదా చేతిని ఎక్కువగా కదల్చకుండా నిశ్చలంగా ఉంచాలి. వాపు వచ్చే అవకాశం ఉన్నందున ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులను వెంటనే తొలగించాలి.

చేయకూడని తప్పులు: గాయంపై బ్లేడుతో కోయడం, నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయడం, తాడు లేదా గుడ్డతో రక్తప్రసరణ ఆగిపోయేలా గట్టిగా కట్లు కట్టడం వంటివి ప్రాణాంతకం.

వెంటనే ఆసుపత్రికి తరలించండి: నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లకుండా యాంటీ-స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే సమీప ప్రభుత్వ లేదా పెద్ద ఆసుపత్రికి బాధితుడిని వీలైనంత త్వరగా తరలించాలి.

సరైన అవగాహన, సమయస్ఫూర్తి ఉంటే పాములు ఎదురైనప్పుడు భయపడకుండా ప్రాణ రక్షణ చేసుకోవడంతో పాటు అనవసర ప్రమాదాలనూ నివారించవచ్చు.

Follow Us