AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషిలా నడిచే చెట్టు ఉందా..? ప్రకృతి అద్భుతానికి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

ప్రకృతి తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. నేటికీ మనిషికి అంతుచిక్కని అనేక అద్భుతాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.. అందులో చెట్లు అతి ముఖ్యమైనవి. మీరు ఊపిరి పీల్చుకునే చెట్టును చూసి ఉంటారు.. కానీ, మీరు ఎప్పుడైనా నడిచే చెట్టును చూశారా..? అవును మీరు విన్నది నిజమే. నడిచే చెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

మనిషిలా నడిచే చెట్టు ఉందా..? ప్రకృతి అద్భుతానికి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
Walking Tree
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2026 | 3:12 PM

Share

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతం నడిచే చెట్లు. అడవుల్లో నడిచే చెట్లు ఉంటాయా..? అక్కడి చెట్లు నిజంగా నడుస్తాయని తెలిస్తే మీరు నమ్ముతారా..? కానీ, మీరు విన్నది నిజమే.. అలాంటి ఒక చెట్టు ఉంది. ఇది పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. దీనిని ప్రేమగా వాకింగ్‌ ట్రీ అని, నడిచే తాటి చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు మధ్య, దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులలో, ముఖ్యంగా ఈక్వెడార్, కోస్టా రికా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాలలో కనిపిస్తుంది. దీని అసలు పేరు సోక్రటీయా ఎక్సోరిజా. ఇది నడిచే సామర్థ్యం కలిగినదిగా ప్రసిద్ధి చెందింది.

ఈ చెట్టు వేర్లే దానికి కాళ్ళు. తన వేళ్ళను కాళ్ళలాగా పెట్టుకుని నడుస్తుందని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. కానీ, ఇది నిజం..ఎందుకంటే.. ఈ సంవత్సరం ఒక చోట ఉన్న ఈ చెట్టు.. వచ్చే సంవత్సరం చూసినప్పుడు అది ఆ ప్రదేశం నుండి ముందుకు లేదంటే, వెనుకకు లేదా పక్కకు జరిగి ఉంటుంది.! అయితే, ఈ చెట్టు మన దేశంలో పెరగదు. ఇది మధ్య, దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తుంది.

ఈ నడిచే తాటి చెట్టు శాస్త్రీయ నామం సోక్రటియా ఎక్సోరిజా. ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఇది సాధారణ చెట్ల మాదిరిగా నేల నుండి నేరుగా పెరగదు. దీని కాండం నేలపై ఒకచోట నుండి మరొక చోటకి వెళ్ళే ప్రత్యేక వేర్లు కలిగి ఉంటుంది. అవి దాని కాళ్ళలా కనిపిస్తాయి. దీని కారణంగా ప్రజలు దీనిని నడిచే చెట్టు అని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా అడవుల్లో నివసించే ప్రజలు ఒక చోట ఉన్న చెట్టు సంవత్సరాల తర్వాత మరొక చోటికి వెళ్లడం చూసి అది కదులుతున్నట్లు భావిస్తారు. అలాగే, ఈ చెట్టు గురించి చాలా కథలు ఉన్నాయి. ఈ చెట్లు సంవత్సరంలో కొన్ని సెంటీమీటర్లు ముందుకు కదులుతాయని చెబుతారు. సూర్యుడి నుండి వెలుతురు పొందడానికి ఈ చెట్టు తన స్థానాన్ని మారుస్తుందని నమ్ముతారు. సైన్స్‌ను నమ్మేవారు మాత్రం ఈ చెట్టు పాత వేర్లు ఎండిపోయి కొత్త వేర్లు పెరుగుతాయని, అందుకే చెట్టు ముందుకు కదిలినట్లు అనిపిస్తుందని చెబుతారు.

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ తాటి చెట్టు నిజానికి నడవదు. చెట్టు ఒకే చోట ఉంటుంది. కానీ, దాని వేర్ల నిర్మాణం దానిని కదిలిస్తుంది. వర్షారణ్యంలోని నేల చాలా మృదువుగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోతుంది.. అలాంటి సందర్భాలలో ఈ ప్రత్యేక వేర్లు చెట్టు పడిపోకుండా నిలబడటానికి ఉపయోగపడతాయి. నేలలో మార్పులకు అనుగుణంగా కొత్త వేర్లు బలంగా పెరుగుతాయి. పాత వేర్లు క్రమంగా క్షీణిస్తాయి. ఈ మార్పు చెట్టు స్థానం ముందుకు కదిలిందనే భ్రమను కలిగిస్తుంది.

నడిచే తాటి చెట్టు వేర్లు చెట్టుకు అదనపు మద్దతును అందిస్తాయి. బలమైన గాలులు వీచినప్పుడు అవి చెట్టు పడిపోకుండా కాపాడతాయి. ఈ వేర్ల నిర్మాణం చెట్టు ఇతర చెట్ల కంటే వేగంగా పెరగడానికి వీలు కల్పిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు నడిచే తాటి చెట్టును ప్రకృతి సృష్టించిన అద్భుతం అని పిలుస్తారు. సాధారణంగా, ఈ చెట్టు కదలదు, దాని ప్రత్యేకమైన మూల నిర్మాణం దానిని ముందుకు కదిలిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…