‘చూపుడువేలుపై సిరా చుక్క.. భవిష్యత్ జీవితపు లెక్క’ అంటున్న గణేశుడు.. ఎక్కడంటే..?

|

Sep 19, 2023 | 4:46 PM

ఓటు హక్కు వినియోగించుకోవడం విషయంలో మనలో చాలామంది ఆసక్తి చూపించరు. కొంతమంది ప్రలోభాలకు లొంగిపోతారు. కొంతమంది ఓటు ఏమి వేస్తాంలే.. అని ఉదాసీనత చూపిస్తారు. ఇప్పుడు రాబోయేది ఎన్నికల కాలం. అది దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం ఓటు విలువ చెప్పే మూషికాలతో వినాయకుడు కొలువయ్యాడు.

చూపుడువేలుపై సిరా చుక్క.. భవిష్యత్ జీవితపు లెక్క అంటున్న గణేశుడు.. ఎక్కడంటే..?
Lord Ganesha
Follow us on

ఓటు హక్కు వినియోగించుకోవడం విషయంలో మనలో చాలామంది ఆసక్తి చూపించరు. కొంతమంది ప్రలోభాలకు లొంగిపోతారు. కొంతమంది ఓటు ఏమి వేస్తాంలే.. అని ఉదాసీనత చూపిస్తారు. ఇప్పుడు రాబోయేది ఎన్నికల కాలం. అది దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం ఓటు విలువ చెప్పే మూషికాలతో వినాయకుడు కొలువయ్యాడు. వినాయకుడే లోక నాయకుడు అని అంటారు కదా.. ఆ గణపయ్యే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోండి. మంచి నాయకులను ఎన్నుకోండి అని చెబుతున్నాడు అక్కడ.

ఈ విఘ్నరాజుడు విశాఖపట్నం తాటిచెట్లపాలెంలో కొలువయ్యాడు. గత పదిహేనేళ్లుగా ప్రతి సంవత్సరం సమాజానికి సందేశం ఇచ్చే గణపతిని ఆవిష్కరించే యువసేవ ఫౌండేషన్ ఈ సంవత్సరం గజాననుడిని పోలింగ్ స్టేషన్ లో కూచోపెట్టింది. ఈవీఎం వినాయకుడు పేరుతొ ఈవీఎం మెషిన్ లో దర్శనమిస్తూ భక్తులను అలరింపచేయడమే కాకుండా ఆలోచించేలా చేస్తున్నాడు. పందిరి సెట్టింగ్ పోలింగ్ స్టేషన్ లా చేశారు. అందులో వినాయకుడు ఈవీఎంలో కనిపిస్తున్నాడు. వినాయకుని ముందు క్యూ లైన్.. ఆ లైన్ లో ఆయన వాహనాలైన మూషికాలు ఓటు వేయడానికి లైన్ లో నిలుచున్నాయి. వాటిని అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఓటు వేసేలా చూస్తున్నరు. అన్నట్టు ఇదీ మూషికమే. అలానే ఓటు వేసిన తరువాత నేను ఓటు వేశాను.. మరి మీరో అంటూ ఆ మూషిక రాజం తన వేలుపై సిరా చుక్క చూపిస్తోంది. ఇక అక్కడ ఓటు ప్రాధాన్యత చెబుతూ మంచి కొటేషన్స్ ఏర్పాటు చేశారు. ”ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశం.. వదులుకోకు నేస్తం”. ”చూపుడువేలుపై సిరా చుక్క.. భవిష్యత్ జీవితపు లెక్క” , ”రోజూ వేలెత్తి చూపించొద్దు.. ఒక్క వేలితో నేతల రాత మార్చేయి”, ”ఏమి చేశావని ఆడగొద్ధు.. ఇది కావాలని కోరవద్దు.. సరయిన నాయకుడికి ఓటు వేయి.. అన్నీ అవే వస్తాయి” ”జీవితం ఒక యుద్ధం.. ఓటు నీ ఆయుధం.. ఎట్టి పరిస్థితిలోనూ చేజారనీయకు!”, ”రెండున్నర గంటల వినోదం కోసం సమయాన్ని వృధా చేస్తాం.. ఐదేళ్ల జీవితం కోసం ఓ గంట ఖర్చు చేయలేమా?”, ”వినాయకుడికి పూజ ఎంత పవిత్రమో.. భావితారాల భవిష్యత్తుకు నీ ఓటు అంత అవసరం..’‘, ”ఐదేళ్లు నేతలు చెప్పింది విన్నావు.. చేసింది చూశావు.. ఇప్పుడు నీ వంతు.. చూపుడు వేలితో సరైన తీర్పు చెప్పు” ఇలా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అని అనిపించేలా ఉన్న కొటేషన్స్ ఆకట్టుకుంటున్నాయి.

తాము పదిహేనేళ్లుగా వినాయక ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నామని.. వినాయకుడికి విచిత్ర వేషధారణలో చూపించే బదులు.. ఇలా సందేశం ఇస్తూ అందరికీ ఎవేర్ నెస్ కల్పించేలా ఉండాలని ప్రతిసంవత్సరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు యువసేవ ఫౌండేషన్ నిర్వాహకుడు పీలా హరిప్రసాద్. పోయిన సంవత్సరం మాస్క్ పెట్టుకోవాలని తమ వినాయకుడితో చెప్పించామనీ.. అంతకు ముందు వాట్సాప్ లాంటి సోషల్ మీడియాకు బానిసలు కావద్దని.. ఏటీఎం ఉపయోగించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదీ.. ఇలానే ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను అందరినీ ఆలోచింప చేసేలా చేస్తూవసున్నామని చెప్పారు. తాము చేసే వినాయక ఉత్సవాల బొమ్మలు తరువాత విశాఖ మ్యూజియంలో ఉంచుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం తమ వినాయకుడి కాన్సెప్ట్ మొత్తం ఎన్నికల కమిషన్ ఆఫీసుకు అందజేయాలని భావిస్తున్నామని వివరించారు.