Video: జుట్టంతా విరబోసుకొని.. ఇదేం డ్యాన్స్ రా బాబు! అరబ్ దేశంలో ట్రంప్‌కు వింత వెల్‌కమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఏఈ సందర్శించిన సందర్భంగా అల్-అయ్యాలా అనే సాంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నృత్యం ఒమన్చ యూఏఈలలో వివాహాలు, పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది. ఈ నృత్యం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యప్రాచ్య పర్యటన చివరి దశలో ఖతార్‌ను సందర్శించిన తర్వాత గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేరుకున్నారు. ఆయనకు UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అబుదాబిలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శనతో స్వాగతం పలికారు. అయితే ఈ వెల్‌కమ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. UAE అధ్యక్ష భవనం అయిన కస్ర్ అల్ వతన్ వద్దకు చేరుకున్న ట్రంప్, ఒమన్ సుల్తానేట్, UAE నుండి వచ్చిన సాంస్కృతిక కళారూపమైన అల్-అయ్యాలా ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఇందులో మహిళలు తమ జుట్టును విరబోసుకొని ఒకవైపు నుండి మరొక వైపుకు ఎగరేస్తూ కనిపించారు. అయితే ఈ వింత నృత్యం మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వైట్ హౌస్ సహాయకుడు మార్గో మార్టిన్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ట్రంప్ డ్రమ్స్ వాయిస్తుంటే వాటికి అనుగుణంగా మహిళల జుట్టును నాటకీయంగా తిప్పుతున్నారు. నృత్యకారులు తమ పొడవాటి జుట్టును ఎడమ నుండి కుడికి తిప్పుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటిని చూస్తూ సంతోషించారు. అదే విధంగా ఈ ప్రదర్శన సమయంలో చాలా మంది పురుషులు కత్తి లాంటి వస్తువులను ఊపుతూ కూడా కనిపించారు. “UAEలో స్వాగత వేడుక కొనసాగుతోంది!” అని మార్టిన్ క్యాప్షన్ ఇచ్చారు.
అయితే ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (UNESCO) ప్రకారం.. అల్-అయ్యాలా అని పిలువబడే ఈ సాంస్కృతిక ప్రదర్శనలో కవిత్వం, డ్రమ్ సంగీతం, నృత్యం చేయడం, యుద్ధ దృశ్యాన్ని అనుకరించడం జరుగుతుంది. సాంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వరుసగా ముందు భాగంలో నిలబడి, తమ పొడవాటి జుట్టును పక్క నుండి పక్కకు విసిరేస్తారు. ఇరవై మంది పురుషుల రెండు వరుసలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి, ఈటెలు లేదా కత్తులను సూచించడానికి సన్నని వెదురు కర్రలను తిప్పుతుంటారు. ఈ నృత్యాన్ని సాధారణంగా ఒమన్, UAEలలో వివాహాలు, పండుగ సందర్భాలలో ప్రదర్శిస్తారు. ప్రదర్శకులు విభిన్న నేపథ్యాలు, వయస్సు వర్గాల నుండి వస్తారు. ప్రధాన ప్రదర్శనకారుడు మాత్రం వారసత్వంగా ఈ హోదా చేపడతాడు. ఇతర ప్రదర్శనకారులకు శిక్షణ ఇచ్చే బాధ్యత అతనిదే. అల్-అయ్యాలాలో వయసుల వారు లింగ భేదం లేకుండా పాల్గొంటూ ఉంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
