50 ఏళ్లుగా నిద్రపోని వ్యక్తి.. డాక్టర్లకే అంతుచిక్కని మిస్టరీ.. అసలు రహస్యం..?
ఒక రోజు నిద్ర లేకపోతేనే తల భారంగా అనిపిస్తుంది.. రెండు రోజులు నిద్ర లేకపోతే మన శరీరం మన మాట వినదు. కానీ ఒక వ్యక్తి ఏకంగా 50 ఏళ్లుగా కన్ను మూయలేదంటే మీరు నమ్ముతారా..? అవును.. అక్షరాలా అరశతాబ్ద కాలంగా ఆయన నిద్రకు దూరంగా ఉంటున్నారు. విచిత్రమేమిటంటే.. నిద్ర లేకపోయినా ఆయన ఆరోగ్యం చెక్కుచెదరలేదు.

ఒక మనిషి సగటున రోజుకు 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఒకటి రెండు రోజులు నిద్ర లేకపోతేనే నీరసం, తలనొప్పి, పిచ్చి పిచ్చిగా అనిపించడం సహజం. కానీ ఒక వ్యక్తి ఏకంగా 50 ఏళ్ల నుంచి అస్సలు నిద్రపోవడం లేదు. వినడానికి నమ్మశక్యం కాకపోయినా మధ్యప్రదేశ్‌లోని రేవా నగరానికి చెందిన మోహన్ లాల్ ద్వివేది జీవితం ఇప్పుడు వైద్య లోకానికి పెద్ద సవాలుగా మారింది. 75 ఏళ్ల రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్ లాల్ ద్వివేది కథ 1973లో మొదలైంది. అప్పుడు ఆయన ఒక లెక్చరర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. జూలై నెలలో ఒక్కసారిగా ఆయనకు నిద్ర రావడం ఆగిపోయింది. మొదట్లో ఇది తాత్కాలిక సమస్య అనుకున్నా, అది దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిద్ర లేకపోయినా ఆయన మేధస్సు ఏమాత్రం తగ్గలేదు. 1974లో MPPSC పరీక్ష రాసి నాయబ్ తహశీల్దార్‌గా ఎంపికయ్యారు, ఆపై 2001లో జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకుని పదవీ విరమణ చేశారు.
వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ
మోహన్ లాల్ వింత పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు మొదట భయపడ్డారు. భూతవైద్యం నుండి ఢిల్లీ, ముంబైలోని టాప్ హాస్పిటల్స్ వరకు అన్నిచోట్లా పరీక్షలు చేయించారు. కానీ ఏ రిపోర్టులోనూ ఆయనకు అనారోగ్యం ఉన్నట్లు తేలలేదు. సాధారణంగా నిద్ర లేకపోతే వచ్చే బీపీ, షుగర్, మానసిక ఆందోళన వంటి ఏ లక్షణాలు ఆయనలో లేకపోవడం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది. పదవీ విరమణ తర్వాత ఆయన సమయం రాత్రిపూట పుస్తకాలు చదవడానికే కేటాయిస్తున్నారు. ఇంట్లో అందరూ నిద్రపోతే, ఈయన మాత్రం టెర్రస్ మీద నడుస్తూ సూర్యోదయం కోసం వేచి చూస్తుంటారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆయన భార్య కూడా రోజుకు కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఇది చాలా అరుదైన కేసు. నిద్రలేమికి వేల కారణాలు ఉండవచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే అది జన్యుపరమైన కారణం అయి ఉండవచ్చు. దీనిపై మరింత లోతైన మానసిక, శారీరక అధ్యయనం జరగాలి” అని తెలిపారు. నిద్ర అనేది మెదడుకు విశ్రాంతినిచ్చే ప్రక్రియ. మరి 50 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మోహన్ లాల్ మెదడు ఎలా పనిచేస్తోందన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
