Viral: స్కూల్‌కు వెళ్లే తొందరలో షూ తొడిగాడు.. ఒక్కసారిగా కుప్పకూలాడు.. చివరకు
ఓ విద్యార్థి స్కూల్‌కు వెళ్లే తొందరలో.. కంగారుగా తన షూ తొడిగాడు. ఇంతలో ఠక్కున స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఏం జరిగిందో ఏమిటో తెలియదు. తన తల్లి హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించింది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

తమిళనాడులోని కడలూరు జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థి తన షూ వేసుకుంటుండగా.. పాము కరిచి ఆస్పత్రిపాలయ్యాడు. స్కూల్‌కి వెళ్లే సమయంలో ఆ బాలుడు షూ తొడుక్కుంటుండగా.. ముందుగానే షూలో దాగి ఉన్న పాము అతడ్ని కాటేసింది. ఇటీవల కాలంలో పాము కాటు సంఘటనలు ఎక్కువైపోయాయి. జనావాసాల్లో ఎక్కువగా తిరుగుతున్న పాములు.. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియట్లేదు. సరిగ్గా అలాంటి కోవకు చెందిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. కడలూరుకు చెందిన కన్నన్, రాధకు ఇద్దరు కుమారులు. 10 సంవత్సరాల కిందట వీరికి వివాహం జరగ్గా.. కన్నన్ విదేశాల్లో పని చేస్తున్నాడు.
దీంతో రాధ తన ఇద్దరు కుమారులతో కలిసి తిట్టకుడిలో ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తోంది. ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ ఒకే ప్రాంతంలోని పాఠశాలలో చదువుతున్నారు. ఇదిలా ఉంటే ఆగష్టు 25న రాధ చిన్న కుమారుడు కౌశిక్ ఎప్పటిలాగే పాఠశాలకు రెడీ అవుతున్నాడు. ఆ సమయంలో, కౌశిక్ షూ వేసుకుంటుండగా.. ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. ఏంటా అని చూడగా..! అతడి షూ నుంచి ఓ పాము బయటకొచ్చింది.
పాము కాటుతో నొప్పి భరించలేక అరుస్తూ స్పృహ కోల్పోయాడు కౌశిక్. ఇక తన కుమారుడి అరుపులు విన్న రాధ.. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. బాలుడికి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించగా.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం బాలుడిని తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు . రామనాథపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, బూట్లు ధరించేటప్పుడు పిల్లలు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
