AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో స్పీడ్ ఫ్రెండింగ్ ట్రెండ్‌.. జస్ట్ 5 నిమిషాల్లో కొత్త స్నేహితులు.. రూల్స్ ఏమిటంటే?

హైదరాబాద్‌లో మరో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే స్పీడ్ ఫ్రెండింగ్.. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నా, కొత్త స్నేహితుల కోసం చూస్తున్నా.. ఈ స్పీడ్ ఫ్రెండింగ్ ఈవెంట్లకు వెళ్తే కొద్ది నిమిషాల్లోనే మీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ స్పీడ్ ఫ్రెండింగ్? ఇక్కడ కొత్త స్నేహితులు ఎలా దొరుకుతారో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో స్పీడ్ ఫ్రెండింగ్ ట్రెండ్‌.. జస్ట్ 5 నిమిషాల్లో కొత్త స్నేహితులు.. రూల్స్ ఏమిటంటే?
Speed Friending Trend Ai Image
Anand T
|

Updated on: Oct 19, 2026 | 4:02 PM

Share

సొంతూరికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేసే ఎంతోమంది యువత కుటుంబసభ్యులను మిస్ అవుతుంటారు. నగరంలో హాస్టల్స్‌లో ఉంటూ ఒంటరితనానికి గురవుతుంటారు. దీనికితోడు పెరుగుతున్న పని ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలామంది డిప్రెషన్, ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసమే నగరంలోకి ఇప్పుడో కొత్త ట్రెండ్ వచ్చింది.

అదే “స్పీడ్ ఫ్రెండింగ్”. ‘రూ. 200 చెల్లించండి.. ఐదు నిమిషాల్లో కొత్త ఫ్రెండ్‌ను వెతుక్కొని, ఒంటరితనాన్ని దూరం చేసుకోండి’ అనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ స్పీడ్-ఫ్రెండింగ్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నగరానికి కొత్తగా వచ్చినవారు స్నేహితులను సంపాదించుకునేందుకు ఈ ఈవెంట్లకు ఎక్కువగా వెళ్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లలో వీకెండ్స్‌లో ఈ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

చేతిలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలో వందలాది మంది పరిచయస్తులు ఉన్నప్పటికీ.. తమ కష్టసుఖాలను పంచుకునేంత నమ్మకమైన స్నేహ బృందాన్ని ఏర్పరచుకోవడం చాలామందికి కష్టంగా మారింది. అలాగే నగరానికి కొత్తగా వచ్చిన వారికి కూడా పరిచయాలు లేకపోవడంతో, వారు ఒంటరితనానికి వీడ్కోలు పలికేందుకు ఆన్‌లైన్ చాటింగులకు బదులుగా నిజమైన స్నేహితుల కోసం ఈ స్పీడ్-ఫ్రెండింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది.

అసలేంటీ స్పీడ్-ఫ్రెండింగ్?

ఈ స్పీడ్-ఫ్రెండింగ్ అనేది ఒక చిన్న సోషల్ క్లబ్బింగ్ ఈవెంట్. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ప్రముఖ కేఫ్‌లు, రెస్టారెంట్లలో ప్రతి వీకెండ్‌లో వీటిని నిర్వహిస్తుంటారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్ ఎంట్రీ పాస్ ధర రూ. 200 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. లోపలికి వెళ్లాక ఎదుటి వ్యక్తితో మాట్లాడేందుకు 3 నుండి 5 నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయం ముగియగానే బెల్ మోగుతుంది. అప్పుడు మొదటి వ్యక్తి నుంచి మారి పక్కనే ఉన్న మరో వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఇలా తక్కువ సమయంలోనే ఎంతోమందితో పరిచయాలు పెంచుకోవచ్చు. అంతేకాదు, కొత్తవారితో మాట్లాడేందుకు మొహమాటపడే వారి కోసం ఇక్కడ ఆటలు, సరదా యాక్టివిటీలను కూడా నిర్వహిస్తారు.

మొత్తంగా చుట్టూ వందలాది మంది పరిచయస్తులు ఉన్నా.. ఒంటరిగా ఫీల్‌ అయ్యే చాలా మంది యువతకు ఈ స్పీడ్ ఫ్రెండింగ్ ఈవెంట్లు ఉపశమనాన్ని కల్గిస్తున్నాయనే చెప్పాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us