హెచ్ఐవీ వచ్చిందని దేవుడిపై పగ.. కోపంతో 12ఏళ్లుగా గుళ్లలో ఏం చేశాడంటే..?
అతడికి హెచ్ఐవీ సోకింది. అది తగ్గాలని దేవుడిని నిత్యం ప్రార్ధించాడు. అయినా అది ఎంతకూ తగ్గలేదు. అయితే తనకు ఆ రోగం రావడానికి దేవుడే కారణమని నమ్మాడు. దేవుడిపై కోపంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో వింత దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లుగా ఇతను దేవాలయాల్లోని విరాళాల పెట్టెల్లో డబ్బును మాత్రమే దొంగిలిస్తూ, విలువైన ఇతర వస్తువులను తాకకుండా అదృశ్యమయ్యేవాడు. ఈ దొంగతనాలను దేవుడిపై ప్రతీకారంగా చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ శివార్లలోని ఓ జైన దేవాలయంలో చోరీ తర్వాత 45 ఏళ్ల యశ్వంత్ ఉపాధ్యాయను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో యశ్వంత్ తన నేరాలకు గల కారణాన్ని వివరించాడు. దీంతో అంతా అవాక్కయ్యాడు.
2012లో ఓ దాడి కేసులో జైలు శిక్ష అనుభవించినప్పుడు తాను హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఉపాధ్యాయ చెప్పాడు. తన తప్పు లేకుండా ఈ వ్యాధి సోకిందని, దీనివల్ల తన జీవితం ఘోరంగా నాశనం అయిందని వాపోమయాడు. ఈ వ్యాధి తనకు రావడానికి దేవుడే కారణమని నమ్మాడు. తాను హెచ్ఐవి నుంచి కోలుకోవాలని నిరంతరం దేవుడిని ప్రార్థించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో దేవుడిపై కోపం పెంచుకున్నాడు. తన కోపాన్ని వెళ్లగక్కడానికి దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని, హుండీల్లోని పెట్టెల్లోని డబ్బును దొంగిలించడం ప్రారంభించాడు.
యశ్వంత్ చాలా తెలివిగా దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేసే ముందు ఆలయాన్ని పరిశీలించేవాడు. కేవలం తన స్కూటర్‌పైనే ప్రయాణించేవాడు, దొంగతనానికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బట్టలు మార్చుకునేవాడు. సిసిటివి కెమెరాలకు చిక్కకుండా ఉండటానికి ప్రధాన రహదారులకు బదులుగా ఇరుకైన సందుల్లో ప్రయాణించేవాడు. ఆలయంలోని హుండీలు పగలగొట్టి, నగదు మాత్రమే తీసుకొని, మళ్లీ ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటికి వెళ్లిపోయేవాడు.
ఇటీవల దుర్గ్ శివార్లలోని ఓ జైన ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. యాంటీ-క్రైమ్, సైబర్ యూనిట్ బృందం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ద్వారా అతడిని గుర్తించి అరెస్ట్ చేసింది. విచారణలో యశ్వంత్ తాను దాదాపు పన్నెండు దేవాలయాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. అయితే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
