
జలుబు, దగ్గు అనేది చిన్న సమస్య అనుకుంటారు చాలా మంది. అందుకే దానిని పెద్దగా పట్టించుకోరు. డాక్టర్‌ని సంప్రదించరు. కానీ, కొన్నిసార్లు ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కావచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో అదే తగ్గిపోతుందిలే అని ఎక్కువ రోజులు వదిలేయకూడదు అంటున్నారు. ఢిల్లీలోని ద్వారకలోని మణిపాల్ ఆసుపత్రిలో నమోదైన ఈ కేసు తెలిసిన తర్వాత మీరు ఈ తప్పు చేయరు. నిజానికి 33 ఏళ్ల మహిళ చాలా నెలలుగా నిరంతరం జలుబు లక్షణాలతో బాధపడుతోంది . ఆమెకు ముక్కు దిబ్బడ, ముక్కు కారటం వంటి సమస్యలు ఉన్నాయి. నెలలు గడుస్తున్నప్పటికీ జలుబు తగ్గకపోవడంతో అప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఆమెకు MRI, CT స్కాన్ చేశారు. ఇది చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు.
ఢిల్లీలోని ద్వారకలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఆ మహిళ మెదడు ముక్కు, నోటిలోకి జారిపోయిందని, అది స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఎండోస్కోపిక్, ట్రాన్స్‌క్రానియల్ పద్ధతులను ఉపయోగించి ఎనిమిది గంటల పాటు శ్రమించిన వైద్య బృందం ఆమెకు సర్జరీ పూర్తి చేశారు.
మణిపాల్ హాస్పిటల్స్‌లోని ఢిల్లీ NCR, న్యూరోసర్జరీ క్లస్టర్ హెడ్ డాక్టర్ అనురాగ్ సక్సేనా మాట్లాడుతూ, రోగికి ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్న అరుదైన సందర్భం ఇదని చెప్పారు. ఆమె మెదడు కణజాలం, నరాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.. ఈ నరాలకు చిన్న గాయాలు కూడా ప్రాణాంతకం కావచ్చునని వివరించారు.. ఆ స్త్రీ కపాలపు అడుగు భాగం క్రమంగా క్షీణించి, మెదడు, నాసికా కుహరాన్ని వేరు చేసే చాలా సన్నని ఎముకగా మారింది. చికిత్స చేయకుండా వదిలేస్తే, అది ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్, శాశ్వత నాడీ సంబంధిత నష్టం, తీవ్రమైన రక్తస్రావంకు దారితీసేదని చెప్పారు.
రోగి మెదడులోని కొంత భాగం పుర్రె బేస్ కిందకు పడిపోయిందని పరీక్షలో తేలిందని ENT (ఓటోరినోలారిన్జాలజీ, హెడ్ & నెక్ & క్రానియల్ బేస్ సర్జరీ, చెవి, ముక్కు & గొంతు) HOD, కన్సల్టెంట్ డాక్టర్ ఆశిష్ వశిష్ట్ వివరించారు. అందుకే ఆమెకు వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వేగంగా కోలుకుంటుందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..