
జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామ శివారులో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. ఇక్కడికి పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 225 మంది కూలీలు రోజూ పనులకు వస్తుంటారు. అయితే, పనుల్లో పాల్గొంటున్న పొరండ్ల గ్రామానికి చెందిన ఒక వృద్ధ దంపతుల 41వ పెళ్లి రోజు అని తోటి కూలీలకు తెలిసింది. దీంతో వారందరూ కలిసి ఆ దంపతులకు ఒక మరపురాని బహుమతి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ రోజు పని ముగిసిన వెంటనే, ఉపాధిహామీ పని స్థలాన్నే పెళ్లి మండపంగా మార్చేశారు. ఆ వృద్ధ దంపతులను పెళ్లి పీటలపై కూర్చోబెట్టి హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి తంతు జరిపించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లాగా వారిని ముస్తాబు చేసి, జీలకర్ర బెల్లం పెట్టడం నుంచి అరుంధతి నక్షత్రం చూపించడం వరకు అన్ని ముచ్చట్లను పూర్తి చేశారు.
కేవలం పెళ్లి చేయడంతోనే ఆగిపోకుండా.. అచ్చం నిజమైన పెళ్లిలాగే ఆడబిడ్డల కట్నకానుకలు ఇవ్వడం, పెళ్లి చేసిన వారికి కానుకలు సమర్పించడం వంటి ఆచారాలను కూలీలంతా కలిసి నిర్వహించారు. అమ్మాయి వైపు, అబ్బాయి వైపు గ్రూపులుగా విడిపోయి అప్పగింతల కార్యక్రమాన్ని కూడా ఎంతో భావోద్వేగంగా, సరదాగా జరిపించారు.
ఈ పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కూలీలందరికీ ఊహించని సర్ప్రైజ్ లభించింది. పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులు, తోటి కూలీలు కలిసి వంటలు ఏర్పాటు చేశారు. వచ్చిన 225 మంది కూలీలకు కూరగాయలు, నోరూరించే మటన్ కూర, బగారన్నం, స్థానిక వంటకమైన మక్కగుడాలతో పసందైన విందు భోజనాన్ని వడ్డించారు. ఎండలో కష్టపడిన కూలీలంతా ఈ పెళ్లి విందును తృప్తిగా ఆరగించి, నూతన దంపతులను దీవిస్తూ ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వేడుకకు సంబంధించిన అప్పగింతలు, కట్నకానుకల వీడియోలను కొందరు మొబైల్స్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. ఈ వినూత్న పెళ్లి ముచ్చట నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ కూలీల ఐక్యతను, సృజనాత్మకతను మెచ్చుకుంటూ నవ్వుకుంటున్నారు. స్థానిక వాట్సప్ గ్రూపుల్లో కూడా ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..