ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఏ వస్తువు కావాలన్నా కాలు బయట పెట్టకుండానే ఆన్‌లైన్ లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. అరచేతిలోనే వందలాది డిజైన్స్ కళ్ల ముందుకు వచ్చేస్తాయి. దుస్తుల దగ్గర్నుంచి హెయిర్ క్లిప్స్ వరకు.. సెల్ ఫోన్ ఛార్జర్ నుంచి ల్యాప్ టాప్స్ వరకు.. ఒక్కటేమిటీ చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వస్తువును ఆన్‌లైన్ లో కొనుగోలు చేయ్యెచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో.. షాపులకు వెళ్లకుండానే కోరుకున్న వస్తువు కళ్ల ముందు ఉంటుంది.
నచ్చిన వస్తువు కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అరచేతిలోని మొబైల్ ఫోన్లో చూసి కొనేస్తుంటారు. అంతేకాకుండా… పెద్దగా కష్టపడకుండానే నచ్చిన ప్రొడక్ట్ డోర్ డెలివరీ అవుతోంది. అంతేకాదు బయట షాపులతో పోల్చుకుంటే ఆన్ లైన్ లో మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో షాపింగ్ చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
అయితే ఆన్ లైన్ షాపింగ్ మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదివరకు ఇలాంటి ఆన్ లైన్ మోసాలు చాలా చోట్ల జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఖరీదైన వస్తువులు కొంటే రాళ్లు, సబ్బులు, ఇతర వస్తువులు వచ్చిన సందర్భాలున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఉట్నూరు మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన పందిరి భీమన్న ఐదు రోజుల కిందట తనకు ఇష్టమైన సెల్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్‌లో ఆర్డర్ చేశారు… పార్శిల్ రాగానే ఎంతో ఆనందంగా తెరిచారు. ప్యాక్ తెరిచిచూడగానే అవాక్కయ్యారు. అందులో ఫోన్‌కు బదులుగా రిన్‌సబ్బు వచ్చింది. ఇటీవల ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ముందుగా జాగ్రత్తగా వీడియో తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.