AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DonnaJean Wilde: ఏకబిగిన 5 గంట‌లు అబ్డామిన‌ల్ ప్లాంక్‌.. బామ్మ ప్రపంచ రికార్డు..!

వయసు 60 దాటితే శరీరం సహకరించదని, కష్టమైన వ్యాయామాలు చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ కెనడాకు చెందిన 61 ఏళ్ల డోన్నాజీన్ వైల్డ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశారు. ఏకంగా ఐదు గంటల పాటు ప్లాంక్ వ్యాయామం చేసి తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తానే తిరగరాశారు.

DonnaJean Wilde: ఏకబిగిన 5 గంట‌లు అబ్డామిన‌ల్ ప్లాంక్‌.. బామ్మ ప్రపంచ రికార్డు..!
Grandmother Of 12 Broke Her Own World Record With A 5 Hour Plank
Sharada V
|

Updated on: Oct 10, 2026 | 10:51 AM

Share

కెనడా డోన్నాజీన్ వైల్డ్‌కు వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే మహిళల విభాగంలో అత్యధిక సమయం ప్లాంక్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2024లో ఆమె 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.అయితే అక్కడితో ఆగిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి ఐదు గంటల పాటు ప్లాంక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే తన లక్ష్యాన్ని చేరుకుని, గతంలో తానే నెలకొల్పిన రికార్డును అధిగమించారు.

అక్టోబర్ 6న అమెరికాలోని ఉటా రాష్ట్రం సెయింట్ జార్జ్‌లో జరిగిన హంట్స్‌మన్ వరల్డ్ సీనియర్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లో ఆమె ఈ రికార్డు ప్రదర్శన ఇచ్చారు. 50 ఏళ్లు పైబడిన క్రీడాకారుల కోసం నిర్వహించే ఈ క్రీడా వేడుకల్లో ప్రేక్షకుల సమక్షంలో ప్లాంక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

తన రికార్డును తానే బ్రేక్ చేసిన బామ్మ!

ఐదు గంటల పాటు ఒకే వ్యాయామ భంగిమలో ఉండటం అంత సులభం కాదు. డోన్నాజీన్ కూడా ఈ సవాలులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో తాను నెలకొల్పిన రికార్డును అధిగమించిన తర్వాత కూడా ఆమె వ్యాయామాన్ని కొనసాగించారు. కానీ చివరి అరగంట మాత్రం తాను ఊహించిన దానికంటే కష్టంగా అనిపించిందనీ, ప్రేక్షకులు ఆమె పేరును పలుకుతూ ఉత్సాహపరిచారనీ వారి ప్రోత్సాహమే తనకు ధైర్యాన్ని ఇచ్చిందని డోన్నాజీన్ చెప్పారు. ఆమె ప్లాంక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక వీడియోకు 90 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

15 ఏళ్ల క్రితం మొదలైన ప్లాంక్ ప్రయాణం!

డోన్నాజీన్‌కు చిన్నప్పటి నుంచే క్రీడలు, వ్యాయామాలంటే ఇష్టం. పాఠశాల రోజుల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఆమె మణికట్టుకు గాయమైంది. దీంతో కొంతకాలం పరుగెత్తడం, సాధారణ వ్యాయామాలు చేయడం సాధ్యపడలేదు. ఆ సమయంలోనే ఆమెకు ప్లాంక్ వ్యాయామం గురించి తెలిసింది. మొదట్లో కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే ఆ భంగిమలో ఉండగలిగేవారు. కానీ క్రమంగా సాధన పెంచుకుంటూ దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత ప్లాంక్ ఆమె దినచర్యలో భాగమైంది. టీచరుగా పనిచేసే సమయంలో పాఠాలు సిద్ధం చేసుకోవడం, విద్యార్థుల పేపర్లు దిద్దడం ప్లాంక్ చేస్తూనే చేసేవారట.ఇప్పుడు కూడా మెసేజ్‌లు పంపడం, ఈమెయిల్స్ చదవడం, ఫోన్‌లో మాట్లాడటం చేస్తూనే ప్లాంక్ చేస్తుంటారు.

గంటలో 1,575 పుష్‌అప్స్.. మరో ప్రపంచ రికార్డు కూడా!

డోన్నాజీన్ ప్రతిభ ప్లాంక్ వ్యాయామానికే పరిమితం కాలేదు. ఆమె పేరిట మరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కూడా ఉంది. 2024లో గంటలో మహిళల విభాగంలో అత్యధిక పుష్‌అప్స్ చేసిన రికార్డును సాధించారు. కేవలం గంటలోపు 1,575 పుష్‌అప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె భర్త రాండీకి కూడా ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉంది. ఇద్దరూ ప్రతిరోజూ కలిసి నడవడం లేదా పరుగెత్తడం చేస్తారు.

మనవళ్లు, మనవరాళ్లకూ క్రీడలంటే ఇష్టమే!

డోన్నాజీన్ కుటుంబంలోనూ వ్యాయామం, క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమెకు ఐదుగురు పిల్లలు, 12 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వారిలో పది మంది కనీసం ఒకటి లేదా రెండు క్రీడా జట్లలో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గుడ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, ఓట్స్ తీసుకుంటారు. అయితే బయటకు వెళ్లినప్పుడు అందరూ తినే ఆహారాన్ని తింటామని, దాని గురించి ఎక్కువగా ఆలోచించమని తెలిపారు.

మరో రికార్డు కోసం సిద్ధమవుతారా?

ఐదు గంటల పాటు ప్లాంక్ చేసి తన రికార్డును తానే అధిగమించిన డోన్నాజీన్.. భవిష్యత్తులో మరోసారి ప్లాంక్ ప్రపంచ రికార్డును బద్దలు కొడతానో లేదో తెలియదని చెప్పారు. అయితే పుష్‌అప్స్‌లో తన రికార్డును మరోసారి అధిగమించే ప్రయత్నం చేయవచ్చని నవ్వుతూ తెలిపారు. 61 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన డోన్నాజీన్ వైల్డ్ కథ అందరికీ స్ఫూర్తినిస్తోంది. వయసు పెరిగినా ఆరోగ్యంపై శ్రద్ధ, నిరంతర సాధన ఉంటే లక్ష్యాలను చేరుకోవచ్చని ఆమె నిరూపించారు.

Follow Us