ఆ రోజు రాత్రి 8 గంటలకు జువెనైల్ హోంలో ఉన్న కొంతమంది బాలురు సౌండ్ ఎక్కువ పెట్టి మరీ టీవీ వీక్షిస్తున్నారు. ఆ సమయంలో సెక్యూరిటీగా ఉన్న అధికారులు.. టీవీ సౌండే కదా అని లైట్ తీసుకున్నారు. అయితే ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. తెల్లారి చూసేసరికి బాలురు లెక్క తప్పింది. ఎంక్వైరీ చేయగా.. దెబ్బకు అధికారుల ఫ్యూజులు ఔట్.!
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని నిజామాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షవర్ రోడ్లతో టాయిలెట్ గోడకు రంధ్రం చేసి ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఐదుగురు బాలురు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో ఇద్దరు నిజామాబాద్‌కు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా వాసులు. వారి వయస్సు16-17 ఏళ్లు. దీనిపై జువెనైల్ హోం సూపరింటెండెంట్ నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు తప్పించుకున్న బాలురు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
జువెనైల్ హోం నుంచి తప్పించుకునేందుకు అండర్ ట్రయిల్‌లో ఉన్న ఐదుగురు బాలురు పక్కా ప్లాన్ వేశారు. ఆదివారం ఉదయం నుంచి షవర్ రాడ్లతో టాయిలెట్ గోడకు రంధ్రం చేయడం ప్రారంభించారు. ఇతరులకు తెలియకుండా టీవీ సౌండ్‌ను ఎక్కువగా పెంచారు. ఇక రాత్రి 9.10 గంటలకు ఐదుగురు బాలురు ఆ రంధ్రం నుంచి తప్పించుకున్నారు. జువెనైల్ హోంలో ఉన్న మరో ముగ్గురు బాలురును.. ఈ ఐదుగురు తమతో పాటు వచ్చేయాలని అడగగా.. వారు దానికి నిరాకరించారని తెలుస్తోంది.