సినిమాలు, సర్కస్‌ల్లో ఏనుగులు వివిధ రకాలు ఫీట్లను చేయడం మనం చూసే ఉంటాం. బంతితో ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, బైక్‌పై వెళ్లడం లాంటివి అన్నమాట. ఇవి తెరపై చూడడ్డానికి బాగానే ఉన్నా నిజ జీవితంలో మాత్రం జరిగితే మనుషులు భయపడాల్సిందే. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జార్ఖండ్‌లో జరిగింది. రాంచీ సమీపంలోని కుద్ బహత్ గ్రామంలోకి వచ్చిన ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. వ్యవసాయ పొలాలను నాశనం చేసింది. అంతేకాదు గట్టిగా అరుస్తూ గ్రామస్తులను పరుగులు పెట్టించింది. అయితే గ్రామస్తులు ఏనుగును ఊరి నుంచి బయటకు తరిమేశారు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఏనుగు ఓ బైక్ ను తొండంతో పట్టుకుని గాల్లోకి విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అడవిలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు ఒకటి కుద్బహత్ గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తులను హడలెత్తించింది. దీంతో వారు ఆ ఏనుగును మళ్లీ అడవిలోకి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఏనుగు అక్కడ టీ స్టాల్ పక్కన ఆపి ఉంచిన బజాజ్ ప్లాటినా బైక్‌ను తొండంతో లేపి అమాంతం గాల్లోకి విసిరికొట్టింది. ఫుట్‌బాల్ ని త్రో వేసినట్లుగా ఎగరేసింది.
కాగా బైక్ యజమాని అప్పుడే తన సామాన్లు అమ్ముకొని ఇంటికి వెళుతూ.. టీ తాగుదామని అక్కడున్న టీ స్టాల్ దగ్గర ఆగాడట. ఇంతలోనే ఆ ఏనుగు బీభత్సం సృష్టించింది. దీంతో పాటు చుట్టూ వేసిన పంటను కూడా తొక్కి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఏనుగు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు, ఆ బైకర్ అటవీశాఖ అధికారులను డిమాండ్ చేశారు. అప్పులు చేసి పంటలు సాగుచేశామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి ఏనుగు బీభత్సం సృష్టించిందని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా రాంచీ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తోందని, గురువారం కూడా అడవి ఏనుగుల గుంపు నుంచి ఏనుగు విడిపోయి గ్రామం వైపు వచ్చిందని తెలిపారు. దీని కారణంగా బైక్‌తో పాటు పలువురి పంటలు కూడా నాశనమయ్యాయని, గ్రామస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు
गजराज को आया गुस्सा… मोटरसाइकिल को फुटबॉल की तरह उछाल-उछालकर पटका#Trending | #ViralVideo pic.twitter.com/sUbMP77G1P
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 10, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..