
నిత్యం మన దైనందిన జీవితంలో మనం అనేక విషయాలను చూస్తాము. కానీ, మనకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే లేదా హాని కలిగించే వాటిపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడతాము. మిగిలిన విషయాలను పట్టించుకోము. చాలా తక్కువ మంది మాత్రమే చిన్న చిన్న విషయలను కూడా తెలుసుకోవాలనుకుంటారు. ఫ్యాషన్ ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. మనం ట్రెండీ దుస్తులు, స్టైలిష్ షర్టులు ధరిస్తాము. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చొక్కాలు, ప్యాంటు తప్పనిసరి. మగవారు మాత్రమే కాదు, మహిళలు కూడా చొక్కా ప్యాంట్లు ధరిస్తున్నారు. కానీ మీరు ప్రతిరోజూ ధరించే చొక్కాను ఎప్పుడైనా గమనించారా! చొక్కా కాలర్ దగ్గర చిన్న బటన్ ఎందుకు ఉంటుంది? అది కేవలం స్టైల్ కోసమే అని మీరు అనుకుంటున్నారా..? కాదు..దాని ఉపయోగాలు తెలుసుకుందాం!
చాలా మంది ఈ బటన్లు కేవలం ఫ్యాషన్ కోసమే అని అనుకుంటారు. కానీ నిజానికి, వాటి వెనుక ఒక చరిత్ర ఉంది. అవి ఫ్యాషన్‌గా ఉండటమే కాకుండా, కొంతమందికి ప్రత్యేక భద్రతను అందించడానికి కూడా ఉపయోగపడతాయి. గుర్రాలపై స్వారీ చేసే సైనికులు, అథ్లెట్ల అవసరాల నుండి ఈ డిజైన్ పుట్టుకొచ్చింది. నేడు మనం చూసే చాలా బ్రాండెడ్ చొక్కాలు కాలర్ పైభాగంలో రెండు చిన్న బటన్‌లను కలిగి ఉంటాయి. వీటిని బటన్-డౌన్ కాలర్ బటన్లు అని పిలుస్తారు. కాలర్‌ను గట్టిగా క్రిందికి ఉంచడం వాటి ప్రధాన విధి. అవి కాలర్‌ను ఒకే చోట స్టివ్‌గా నిలబడి ఉంచడంలో చాలా సహాయపడతాయి. ఇది మిమ్మల్ని స్మార్ట్‌గా చూపిస్తుంది.
ఈ బటన్-డౌన్ కాలర్ డిజైన్ మూలం ఈక్వెస్ట్రియన్ దుస్తుల నుండి వచ్చింది. గతంలో పోలో ఆటగాళ్ళు, గుర్రపు స్వారీ చేసేవారు ప్రత్యేక దుస్తులు ధరించేవారు. ముఖ్యంగా ఐవీ లీగ్ కాలేజ్ ఆటగాళ్ళు పోలో మ్యాచ్‌ల సమయంలో బటన్-డౌన్ కాలర్ చొక్కాలను ఉపయోగించారు. గుర్రంపై వేగంగా స్వారీ చేసేటప్పుడు బట్టలు శరీరానికి సరిపోయేలా ఉండటం ముఖ్యం. గుర్రంపై స్వారీ చేసేటప్పుడు గాలి ముఖంపై బలంగా వీస్తుంది. అప్పుడు చొక్కా కాలర్ పైకి లేచి ముఖానికి తాకుతుంది. దీని వల్ల దృష్టి పక్కదారి పడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు కాలర్ చివరలకు చిన్న బటన్‌లను యాడ్ చేశారు. అవి కాలర్‌ను కిందికి బిగిగా ఉంచి, రైడర్లకు మరింత సౌకర్యం, భద్రతను అందించాయి. ఆ కాలంలో ఇది ఒక ప్రయోగంలా మొదలైనప్పటికీ, చాలా ఉపయోగకరంగా మారింది.
కాలం మారుతున్న కొద్దీ ఈ డిజైన్ ఫ్యాషన్‌గా మారింది. నేటికీ, బటన్-డౌన్ కాలర్‌లతో కూడిన షర్టులు, టీ-షర్టులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా మంది వాటి అసలు ఉపయోగం తెలియకుండానే, కేవలం స్టైల్ కోసం వాటిని ధరిస్తారు. ఒక చిన్న అవసరం నుండి ఉద్భవించిన ఈ డిజైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌లో ముఖ్యమైన భాగంగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..