AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’

వయసు 60 ఏళ్లు.. అయినా జీవితంపై ఆమెకు ఎంతో నమ్మకం. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. రెండేళ్ల వ్యవధిలో మరోసారి తల్లి అయ్యారు. తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచారు. చైనాకు చెందిన జాంగ్ అనే మహిళ మాతృత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన వయసు గురించి ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోనని, తన దృష్టిలో తాను ఇంకా 28 ఏళ్ల యువతినేనని ఆమె చెబుతున్నారు.

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’
Chinese Woman Gives Birth To Second Child At 60
Sharada V
|

Updated on: Oct 12, 2026 | 11:27 PM

Share

చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జుమాడియన్ సెంట్రల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17న జాంగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరగ్గా.. పాప పుట్టినప్పుడు 2.8 కిలోల బరువు ఉంది. రెండేళ్ల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బాబును కుటుంబ సభ్యులు ముద్దుగా ‘గువోగువో’ అని పిలుచుకుంటారు. 60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కావడం అరుదైన విషయమే. ముఖ్యంగా ఈ వయసులో గర్భధారణ, ప్రసవం అనేవి వైద్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. అయినప్పటికీ, ఇద్దరు చిన్నారులతో తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని జాంగ్ చెబుతున్నారు.

గతంలో బిడ్డను కోల్పోయిన విషాదం

జాంగ్, ఆమె భర్త 2022లో వారి బిడ్డను కోల్పోయారు. ఆ తర్వాత జాంగ్‌కు కుమారుడు జన్మించగా.. ఇప్పుడు ఆడబిడ్డ కూడా జన్మించడంతో ఆమె కుటుంబంలో ఆనందం నెలకొంది. తనకు కొడుకు, కూతురు ఇద్దరూ ఉండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆమె తెలిపారు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నారు. నా జీవితం ఎంతో పరిపూర్ణంగా అనిపిస్తోంది. ఇద్దరూ కలిసి పెరుగుతారు. ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒంటరిగా ఉన్నామనే భావన వారికి కలగదు’ అని జాంగ్ అన్నారు.

గర్భంతో ఉన్నా ఇంటి పనులు చేసుకున్న మహిళ

వయసు ఎక్కువగా ఉండటంతో ఈ సమయంలో పిల్లలను కనడం అవసరమా? అని కొందరు ప్రశ్నించే అవకాశం ఉందని జాంగ్‌కు తెలుసు. అయితే, అలాంటి అభిప్రాయాల గురించి తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలిపారు. గర్భంతో ఉన్న సమయంలోనూ ఇంట్లో వంట చేయడం, ఇతర పనులు చూసుకోవడం కొనసాగించాననీ, తన ఆరోగ్యంపై తనకు నమ్మకం ఉందని, అందుకే భవిష్యత్తు గురించి ధైర్యంగా ఉన్నానని వివరించారు.

‘నా తండ్రి 100 ఏళ్లు జీవించారు.. అమ్మకు 94 ఏళ్లు’

తన ఆరోగ్యంపై ఉన్న నమ్మకానికి కుటుంబ చరిత్ర కూడా ఒక కారణమని జాంగ్ చెబుతున్నారు. తన తండ్రి 100 ఏళ్లు జీవించారపీ, ప్రస్తుతం తన తల్లికి 94 ఏళ్లు అన్నారు. వయసు మీద పడినా తన తల్లికి చూపు, వినికిడి బాగున్నాయని, ఆమె ఇప్పటికీ స్వయంగా మెట్లు ఎక్కుతారనీ చెప్పారు. ‘నా తల్లిదండ్రుల మాదిరిగానే నేను కూడా ఆరోగ్యంగా ఉన్నానని నమ్ముతున్నాను. నేను చనిపోయే సమయానికి నా పిల్లలు పెరిగి పెద్దవారై, పెళ్లిళ్లు చేసుకుని ఉంటారని విశ్వసిస్తున్నాను’ అన్నారు.

‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే!’

60 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం అరుదైన విషయమే అయినప్పటికీ.. తనను తాను ఇతరులు చూసే కోణంలో చూడనని జాంగ్ అంటున్నారు. ‘నా దృష్టిలో నా వయసు కేవలం 28 ఏళ్లే. నేను చాలా కాలం జీవిస్తానని నమ్ముతున్నాను’ అంటున్నారు. అయితే, 60 ఏళ్ల వయసులో గర్భధారణ, ప్రసవం వంటి అంశాల్లో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరం. జాంగ్‌ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు చిన్నారులు ఉండటంతో.. వారి భవిష్యత్తుపై ఆమె ఎంతో ఆశాభావంతో ఉన్నారు.

Follow Us