Chronic Sneezing: వింత ఘటన.. ముక్కు దిబ్బడతో డాక్టర్ దగ్గరికి వెళ్లిన యువకుడు! స్కానింగ్ రిపోర్టు చూసి పరేషాన్
ఓ వ్యక్తి 20 యేళ్లుగా జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల డాక్టర్ వద్దకు వెళ్తే స్కాన్ చేసి చూశాడు. స్కాన్ రిపోర్టులో అతగాడి ముక్కు భాగంలో ఏదో వింత వస్తువు ఉన్నట్లు కనిపించింది. ఆపరేషన్ చేసి చూడగా..
ఓ వ్యక్తికి గత 20 సంవత్సరాలుగా తుమ్ములు, ముక్కు కారటం సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఇటీవల ఆయన ఓ వైద్యుడి వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసింది. స్కానింగ్‌లో అతని ముక్కులో ఏదో వింత వస్తువు ఉండటం చూసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆనక ఆపరేషన్ చేసి దానిని బయటకు తీయడంతో అతగాడి సమస్య తీరిపోయింది. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది.
ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రాంతంలోని జియాన్ అనే 23 ఏళ్ల వ్యక్తి ఇటీవల తుమ్ములు, ముక్కు కారడం వంటి దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఇటీవల జియాన్‌లోని గోక్సిన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు తొలుత అది ఎలర్జీ కావచ్చునని అనుకున్నారు. కానీ అతడి ముక్కును ఎండోస్కోపీ చేయగా అందులో ఏదో ఒక వస్తువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రిలోని ఓటోలారిన్జాలజిస్ట్ యాంగ్ రోంగ్ నిర్వహించిన నాసికా ఎండోస్కోపీలో జియోమా ముక్కు కుహరంలోపల డైస్ (పాచికల ఆటలో వాడే ఒక విధమైన పాచిక) ఉన్నట్లు తెలిపాడు.
దీనిని ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే ఈ పాచికలు అతడి ముక్కులో ఏళ్ల తరబడి ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నేళ్లు ముక్కుల లోపల ఉండటం వల్ల అది కొద్దిగా అరిగిపోయింది. నిజానికి.. జియాన్‌కి మూడు, నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పాచిక తన ముక్కులోకి వెళ్లిందని గుర్తుచేసుకున్నాడు. ఈ పాచిక అతని ముక్కులో సుమారు 20 సంవత్సరాల పాటు ఉంది. అదృష్టవశాత్తూ 20 సంవత్సరాలుగా అది ముక్కులో ఉన్నప్పటికీ అతనికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకపోవడం విశేషం. పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రుల అప్రమత్తతంగా ఉండాలని, ఒక వేళ తన ముక్కులో ఉన్న ఈ వస్తువు లోపలికి వెళ్లి ఉంటే ఊహించని ప్రమాదం జరిగేదని, అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదని జియాన్ చెప్పుకొచ్చాడు. పిల్లలు పొరబాటున ఏదైనా వస్తువు ముక్కులో పెట్టుకుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. లేదంటే అది పోస్ట్‌నారిస్ లేదా వాయుమార్గంలోకి ప్రవేశించి ప్రాణాంతక ప్రమాదాన్ని కలిగిస్తాయి.