AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటికి ఇన్సురెన్స్‌ చేయించుకున్న నటి..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

బ్రిటీష్ నటి సింథియా ఎరివో తన నోటికి రూ. 16.5 కోట్ల బీమా చేయించుకున్న విషయం హాట్ టాపిక్ అయింది. లిస్టెరిన్ ప్రచారకర్తగా, నోటి శుభ్రతపై ఆమె దృష్టిని బలపరుస్తూ ఈ బీమాను తీసుకుంది. ఆమె నవ్వు, గొంతు తన వృత్తికి ఎంతో ముఖ్యమని పేర్కొంది.

నోటికి ఇన్సురెన్స్‌ చేయించుకున్న నటి..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Cynthia Erivo
SN Pasha
|

Updated on: Jul 31, 2025 | 6:56 PM

Share

సాధారణంగా ఎవరైనా ఇన్సురెన్స్‌ తీసుకుంటే.. లైఫ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమ ఆస్తికి కూడా ఇన్సూరెన్స్‌ చేయించుకుంటూ ఉంటారు. అగ్నిప్రమాదాలు లాంటివి సంభవిస్తే నష్టపోకుండా ఉండేందుకు. ఎవరైనా ఇలాంటి ఇన్సూరెన్స్‌ల గురించే విని ఉంటారు. కానీ, ఓ ప్రముఖ నటి ఇవన్నీ కాకుండా ఓ ప్రత్యేకమైన ఇన్సూరెన్స్‌ తీసుకుంది. అదే మౌత్‌ ఇన్సూరెన్స్‌ వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగానే జరిగింది. బ్రిటిష్‌ నటి, సింగర్ సింథియా ఎరివో (Cynthia Erivo) ఏకంగా రూ.16.5 కోట్లు ఖర్చు పెట్టి తన నోటికి ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు.

మౌత్‌వాష్‌ బ్రాండ్ లిస్టెరిన్ నిర్వహిస్తోన్న ‘వాష్ యువర్ మౌత్‌’ కార్యక్రమానికి ఈమె ప్రచారకర్తగా ఉన్నారు. అలాగే నోటి శుభ్రతకు ఆమె అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తన నవ్వు, గొంతుకు ఉన్న ప్రత్యేకత కారణంగానే వృత్తి, వ్యక్తిగత జీవితంలో రాణిస్తున్నానని వెల్లడించారు సింథియా. తన రెండు దంతాల మధ్య ఉన్న గ్యాప్‌ను, తన విలక్షణ నవ్వు, గళాన్ని కాపాడుకునేందుకు ఈ బీమా (Insurance to Mouth) వైపు మొగ్గు చూపానని ఆమె వెల్లడించారు.

బ్రిటన్‌కు చెందిన 38 ఏళ్ల సింథియా నటన, పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీవంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేషన్లను పొందారు. వాటిల్లో ఆస్కార్ తప్ప మిగతావాటిని ఆమె అందుకున్నారు. ఆమె నటించిన విక్డ్‌: ఫర్‌ గుడ్‌, చిల్డ్రన్‌ ఆఫ్ బ్లడ్‌ అండ్‌ బోన్‌ చిత్రాలు త్వరలో విడుదలకానున్నాయి. అయితే ఆమె ఇన్సూరెన్స్ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను హాలీవుడ్‌లో ‘అత్యంత విలువైన చిరునవ్వు’ కలిగిన మహిళగా పిలుచుకుంటున్నారు.

అయితే ఇలా శరీరాభాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్న మొదటి సెలబ్రిటి ఈమె కాదు. ఇంకా చాలామందే ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్ తన వీపు భాగాన్ని రూ.200కోట్లకు బీమా చేయించారని గతంలో వార్తలు వచ్చాయి. అమెరికన్ సింగర్‌ మారియా కరే తన కాళ్లు, స్వరపేటికల కోసం రూ.500 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్‌హామ్ తమ కాళ్లకు బీమా తీసుకున్నారు. బ్రిటిష్‌ సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్‌సే తన నాలుకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి