మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి..! ఈ అందం వెనుక మహా విషం..?
చూడ్డానికి బొమ్మలా అందంగా, మచ్చిక చేసుకున్న పిల్లిలా లేదా వెల్వెట్ లా కనిపించే ఈ వింత పురుగు చాలా ప్రమాదకరమైనది. దీనిని శాస్త్రీయంగా ఫ్లానెల్ మాత్ కేటర్పిల్లర్ అంటారు. దీని అందాన్ని చూసి మురిసిపోయి తాకడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పార్కులు లేదా తోటల్లో తిరిగేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఈ కీటకం కనిపిస్తే వెంటనే దూరంగా వెళ్లిపోవడం మంచిది. అసలు ఇంతకీ ఏంటి ఈ ప్రమాదకర పురుగు.. ఇది మనుషుల్ని ఎలా చంపుతుంది..? ఇప్పుడు చూద్దాం..

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, వింత జీవులు ఉన్నాయి. కొన్నిసార్లు అందంగా కనిపించే జీవులే అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వింత పురుగు గురించిన వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చూడటానికి ఎంతో అందంగా, మృదువైన బొమ్మలా, పిల్లి పిల్లలా లేదా బంగారు వర్ణపు మీసాల లాగా కనిపించే ఈ కీటకాన్ని పస్ కేటర్పిల్లర్ లేదా ఫైర్ కేటర్పిల్లర్ అని పిలుస్తారు. శాస్త్రీయ నామం ఫ్లానెల్ మాత్ కేటర్పిల్లర్. అయితే, దీని ఆకర్షణీయమైన రూపాన్ని చూసి మోసపోతే ప్రాణాల మీదకే వస్తుంది.
శరీరం కింద దాగున్న ప్రాణాంతక ఆయుధం
దూరంగా చూస్తే ఇదో అందమైన బొమ్మలా కనిపిస్తుందిగానీ, దీని శరీరంపై ఉండే వెల్వెట్ లాంటి రోమాలలో విషంతో నిండిన సూది లాంటి ముళ్లు దాగి ఉంటాయి. ఎవరైనా దీనిని తాకాలని ప్రయత్నిస్తే, ఆ ముళ్లు చర్మం లోపలికి చొచ్చుకుపోతాయి. ఆ క్షణంలో మొదలైన నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. శరీరంపై కాలిపోతున్న నిప్పును ఉంచినంత తీవ్రమైన మంట, భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ తీవ్రమైన ప్రభావం దాదాపు 12 గంటల పాటు కొనసాగుతుంది.
జీవన విధానం, ప్రత్యేకతలు
ఈ పురుగు చెట్ల ఆకులను తింటూ తన జీవనాన్ని సాగిస్తుంది. దీని ఆకృతి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దీని తల ఎక్కడ ఉందో, తోక ఎక్కడ ఉందో మొదటి చూపునకు అస్సలు అర్థం కాదు. చెట్ల కాండాలపై సులభంగా పాకడానికి వీలుగా దీని కాళ్లు సక్షన్ కప్ లా పనిచేస్తాయి. అంతేకాదు, ఇది చాలా తెలివైనది. శత్రువులకు తన ఉనికి తెలియకుండా ఉండటానికి తాను విడిచిపెట్టిన చర్మాన్ని తానే తినేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నారులు పార్కుల్లో ఆడుకునేటప్పుడు లేదా పెద్దలు గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలాంటి కీటకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దీని శరీరం పొరపాటున చర్మానికి తగిలినా తీవ్రమైన అలర్జీలు, దద్దుర్లు, వాపు వస్తాయి. కొన్నిసార్లు వాంతులు కూడా కావొచ్చు. అయితే దీని విషం ప్రాణాంతకం కానప్పటికీ, తీవ్రమైన నొప్పులను కలిగిస్తుంది.
View this post on Instagram
ఒకవేళ పొరపాటున దీని బారిన పడితే, ఆ ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టి కాపడం పెట్టాలి. దురద, మంట తగ్గడానికి యాంటీ హిస్టామైన్ మందులు వాడాలి. మీ ఇంటి చుట్టూ లేదా ఉద్యానవనాలలో ఈ పురుగు కనిపిస్తే, దాని జోలికి వెళ్లకుండా వెంటనే సురక్షిత దూరానికి పారిపోవడమే ఉత్తమం!




