AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చెప్పులు తీసేసి చీరలో 1600 మీటర్లు పరుగు.. ! ఈ మహిళ కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

చుట్టూ ఉన్నవారు ట్రాక్‌సూట్లు, షూస్‌తో సిద్ధంగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం సాధారణ చీరలోనే వచ్చింది చెప్పులు తీసేసి పరిగెత్తింది. అయితే ఆమె వేగం చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. 1600 మీటర్ల పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆమే కవితా కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన వితంతువు. వైరల్‌గా మారిన వీడియో వెనుక కవిత జీవితం.. ఆమె కష్టాలు.. ఆమె లక్ష్యం తెలిస్తే పరుగు విలువ మరింత అర్థమవుతుంది.

Video: చెప్పులు తీసేసి చీరలో 1600 మీటర్లు పరుగు.. ! ఈ మహిళ కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Barefoot In A Blue Saree A Tribal Widow Ran For A Job And The Stadium Roared
Sharada V
|

Updated on: Oct 08, 2026 | 12:28 PM

Share

జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లా సోసో గ్రామానికి చెందిన కవిత ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి పరుగు ప్రాక్టీస్ చేస్తుంది. ఆమెకు ఖరీదైన ట్రాక్‌సూట్ లేదు. రన్నింగ్ షూస్ లేవు. కోచింగ్‌కు వెళ్లే స్థోమత కూడా లేదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..’డ్రెస్‌లు, షూస్ కొనడానికి.. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి నా దగ్గర ఒక్క పైసా లేదు. అందుకే నేనే సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను’ అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన గ్రామంలోనే పరుగెత్తుతూ ప్రాక్టీస్ చేస్తుంది.

అక్టోబర్ 4న రామ్‌గఢ్‌లోని సిద్ధూ కాన్హూ స్టేడియంలో ట్రయల్ రన్ నిర్వహించారు. హోంగార్డ్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు అసలు పరీక్ష జరిగే స్టేడియం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్‌లో పాల్గొన్నారు. కవిత కూడా అక్కడికి వచ్చింది. ‘నేను చీరలో ఉన్నాను. చుట్టూ ఉన్నవాళ్లంతా ట్రాక్‌సూట్లు, షూస్‌తో ఉన్నారు. వాళ్లను చూసి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా టెన్షన్ పడ్డాను’ అని కవిత చెప్పింది.

చెప్పులు తీసేసి పరుగెత్తింది!

రన్ మొదలయ్యే సమయానికి కవిత తన కాళ్లకున్న చెప్పులను తీసేసింది. చెప్పులు లేకుండానే పరుగెత్తి ముందున్న అభ్యర్థులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ వేగంగా ముందుకు వెళ్లింది. ఆ సమయంలో కవిత చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. ఆమె మనసులో ఉన్నది ఒక్కటే ..హోంగార్డ్ ఉద్యోగం ఎలాగైనా సాధించాలన్న పట్టుదల.. 1600 మీటర్ల పరుగును మహిళా అభ్యర్థులు 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. కానీ కవిత ఆ దూరాన్ని కేవలం 8 నిమిషాల్లోనే పూర్తి చేసింది. దీంతో ఆమెకు ‘ఎక్సలెంట్’ గ్రేడ్‌తో పూర్తి మార్కులు వచ్చాయి.

కవిత చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రజలు నాకు చప్పట్లు కొట్టే వరకు నేను ఎంత బాగా పరుగెత్తానో నాకు తెలియదు. పరుగెత్తుతున్న సమయంలో నా మనసులో హోంగార్డ్ ఉద్యోగం తప్ప మరో ఆలోచన లేదు’. ఎవరెవరో ఆమె పరుగును వీడియో తీశారు. వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది.స్టేడియంలో కవితకు వచ్చిన చప్పట్లు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి.

284 ఉద్యోగాలు.. 16 వేల మంది అభ్యర్థులు

కవిత లక్ష్యంగా పెట్టుకున్నది సాధారణ ఉద్యోగం కాదు. జార్ఖండ్ హోంగార్డ్ నియామకానికి రామ్‌గఢ్ జిల్లాలో కేవలం 284 ఖాళీలు ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగాలకు 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో ఉద్యోగానికి ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి దశలోనే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. 1600 మీటర్ల పరుగు మాత్రమే కాదు.. లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్ పరీక్షలు కూడా ఉంటాయి. ఆ తర్వాత రాత పరీక్ష ఉంటుంది

అక్టోబర్ 4న జరిగిన ట్రయల్ రన్‌కు 1,900 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో దాదాపు 1,100 మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలంతా చీరల్లోనే  రన్‌లో పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు ట్రాక్‌సూట్లు, రన్నింగ్ షూస్ కొనడం మాత్రమే కాదు.. వాటితో బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టమేనని ట్రయల్ నిర్వహించిన రన్నర్ అకాడమీ నిర్వాహకుడు అంకిత్ సింగ్ చెప్పారు. అందుకే అసలు పరీక్ష జరిగే స్టేడియం పరిస్థితులకు అభ్యర్థులు ముందుగానే అలవాటు పడేలా ఈ ట్రయల్ నిర్వహించినట్లు తెలిపారు.  స్టేడియంలో కొన్ని చోట్ల వాలు ఉండటంతో పాటు ఇసుక, కంకర, అసమానమైన నేల కూడా ఉంది. హోంగార్డ్ ఫిజికల్ టెస్ట్ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 5 వరకు ఇదే స్టేడియంలో జరగనుంది. ‘ఫిజికల్ ఎగ్జామ్ రోజు కూడా ఇదే శక్తితో, ఇదే నమ్మకంతో పరుగెత్తాలని కోరుకుంటున్నాను’ అంటోంది కవిత.

భర్తను కోల్పోయిన కవిత..చేతిలో డబ్బు లేకపోయినా..ఖరీదైన షూస్ లేకపోయినా..కోచింగ్ తీసుకోకపోయినా ..చీరలోనే స్టేడియానికి వచ్చి చెప్పులు తీసేసి 1600 మీటర్ల పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆమె ముందున్న లక్ష్యం  ఒకటే..హోంగార్డ్ ఉద్యోగం సాధించడం. కవిత పరుగు కేవలం 1600 మీటర్ల పరుగు కాదు. అది ఆమె జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ కోసం చేస్తున్న పరుగు. ఆమె కాళ్లకు చెప్పులు లేకపోయినా.. గుండెల్లో మాత్రం గెలవాలనే కొండంత నమ్మకం ఉంది.

Follow Us