Moral Story: దురాశకు పోయిన కాకికి జీవితాంతం బాధ పడే శిక్ష పడింది..
వ్యాపారి వంటగదిలో పావురం ప్రశాంతంగా జీవిస్తుండగా, దురాశతో కూడిన కాకి దానితో స్నేహం చేసి ఆశ్రయం పొందింది. చేపల కోసం కక్కుర్తిపడి, పావురాన్ని మోసగించి, దొంగిలించడానికి ప్రయత్నించిన కాకి వంటవాడి ఆగ్రహానికి గురై రెక్కలు విరిగిపోయి దుఃఖంలో మునిగిపోయింది. ఈ కథ దురాశ దుష్ఫలితాలను స్పష్టం చేస్తుంది.

ఒక వ్యాపారికి చాలా పెద్ద వంటగది ఉండేది. ఆ గదిలో విశాలమైన కిటికీ ఎల్లప్పుడూ తెరిచి ఉండేది, స్వచ్ఛమైన గాలి కోసం. ఆ కిటికీ పక్కనే అటకపై ఒక పాత పండ్ల బుట్ట ఉండేది. ఆ బుట్టను ఒక పావురం తన నివాసంగా మార్చుకుని అక్కడ నివసించేది. వ్యాపారి దయాహృదయుడు కాబట్టి, పావురాన్ని వంటగది నుంచి వెళ్లగొట్టవద్దని తన వంటవాడిని ఆదేశించాడు. అంతేకాకుండా, నిత్యం దానికి భోజనం పెట్టాలని కూడా చెప్పాడు. ఈ విధంగా, పావురానికి మంచి నివాసం, ఆహారం దొరికాయి. ఒక రోజు, ఒక కాకి ఎగురుతూ వంటగది పక్కనుండి వెళ్ళసాగింది. వంటగదిలో నుంచి వస్తున్న రకరకాల వంటకాల సువాసనలు కాకిని ఆకర్షించాయి. కాకి నోరూరి, అక్కడే వాలిపోయింది. అటకపై నివసిస్తున్న పావురం దాని కంటపడింది. కాకి పావురంతో స్నేహం చేయాలని నిశ్చయించుకుంది. కొన్నాళ్లకు, వంటగదిలో పావురం ఒంటరిగా ఉండగా చూసి, కాకి మెల్లగా కిటికీ వద్దకు వచ్చి దానితో మాట్లాడింది. “ఓ నా ప్రియమైన పావురమా, నాతో స్నేహం చేస్తావా? రోజూ నీ వెంట ఆహారాన్ని వెతుక్కుంటూ వస్తాను,” అని కాకి అడిగింది. పావురం సంశయిస్తూ, “నేను దానిమ్మ గింజలు తింటాను, నువ్వేమో పురుగులు, కీటకాలను ఇష్టపడతావు. మన ఆహారం వేరు,” అంది. కాకి అందుకు సమాధానంగా, “ఎంతైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు వెంట ఉండడం మంచిదే కదా,” అని ఒప్పించింది. తనకొక స్నేహితుడు అవసరం అని భావించిన పావురం కాకి మాటలను విశ్వసించింది. ఈ విధంగా, కాకి పావురంతో కలిసి ఆహారం కోసం అన్వేషణకు వెళ్లేది. కొద్ది రోజుల్లోనే అవి మంచి మిత్రులుగా మారాయి.
ఒక రోజు పావురం కాకిని వంటగదిలోకి తీసుకుని వచ్చింది. వంటవాడు పావురం తన మిత్రుడిని కూడా తీసుకొచ్చిందని గ్రహించి, కాకి కోసం కూడా ఒక పాత బుట్టను నివాసంగా ఏర్పాటు చేశాడు. కాకి ఎంతో సంతోషపడింది, ఎందుకంటే తాను కోరుకున్నట్లుగానే పనులు జరిగిపోతున్నాయి. కాకి పావురంతో సమానంగా, దర్జాగా ఆ ఇంట్లో జీవించసాగింది. ఒక సాయంత్రం, వ్యాపారి వంటగదిలోకి వచ్చి వంటవాడితో ఇలా అన్నాడు: “నేను తాజా చేపలు తెచ్చాను. జాగ్రత్తగా దాచి, రేపటి మధ్యాహ్న భోజనానికి చేపల పులుసును ఏర్పాటు చెయ్. మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు. వారి కోసం పాయసం కూడా తయారు చెయ్.” ఇది విన్న కాకికి చేపల పట్ల తీవ్రమైన దురాశ కలిగింది. మరుసటి రోజు ఉదయం, పావురం ఆహారం కోసం బయలుదేరుదామని కాకిని పిలిచింది. కానీ కాకి “లేదు మిత్రమా, ఈరోజు నేను నీ వెంట రాలేను. నా కడుపులో నొప్పిగా ఉంది. నిన్న కుళ్ళిపోయిన పురుగును ఏమైనా తిన్నానో ఏమో. నేను ఈరోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను,” అని అబద్ధం చెప్పింది. పావురం నిరాశగా ఒంటరిగా ఆహారం కోసం బయలుదేరింది.
కాసేపటి తర్వాత వంటవాడు వంటగదిలోకి వచ్చాడు. చేపను తీసుకొని శుభ్రం చేసి, ఉప్పులో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. పాత్రలో నూనెను వేడి చేసి చేప ముక్కల్ని అందులో వేసి వేగిన తర్వాత మసాలా దట్టించాడు. కాకి ఎంతో ఆసక్తిగా ఇదంతా గమనిస్తూ ఉంది. వంటవాడు చేపల వేపుడు పాత్రపై ఒక మూతను మూసి వెళ్ళిపోయాడు. కాకి ఇదే సమయం కోసం నిరీక్షిస్తూ ఉంది. వంటవాడు వెళ్ళగానే కాకి పాత్ర వద్దకు చేరి మూతను తెరిచే ప్రయత్నం చేసింది. అప్పుడు పాత్రపై ఉన్న మూత పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దం విన్న వంటవాడు కంగారుగా వంటగదిలోకి పరుగు తీశాడు. అంతలోనే కాకి చేప ముక్కను నోట కరచి పెట్టుకుంది. అది చూసిన వంటవాడికి కోపం వచ్చింది. అతను కాకి గొంతు పట్టుకుని “ఆశబోతు కాకి! నేను నిన్ను నీ మిత్రునితో పాటు దయతలచి ఇక్కడ ఉండటానికి అనుమతినిస్తే, నువ్వు చేసే పని ఇదా? నీ దురాశకి ఈ శిక్ష కూడా తక్కువే,” అన్నాడు. కాకి “నన్ను క్షమించు. దురాశ నన్ను మూర్ఖుడిగా చేసింది. నేను ఈ పొరపాటుని ఇంకెప్పుడూ చేయను,” అని బ్రతిమిలాడింది. కానీ వంటవాడు వినలేదు. అతను కాకి రెక్కల్ని విరిచి, దానిని చెత్త డబ్బాలో పారవేసి వెళ్ళిపోయాడు. కాకి దుఃఖంలో మునిగి “అయ్యో, ఎంత పని జరిగింది! నా దురాశ దుఃఖాన్ని మిగిల్చింది. ఉదయం పావురంతో పాటు వెళ్ళినా బాగుండేది. నాకు ఈ దుర్గతి పట్టేది కాదు కదా,” అని పశ్చాత్తాపపడింది.
కొద్దిసేపటి తర్వాత పావురము వంటగదిని చేరుకుంది. రెక్కలు విరచబడిన కాకి దుస్థితిని గమనించి, ఎందుకు ఇలా జరిగిందో అర్థం చేసుకుంది. అది కాకితో, “అయ్యో స్నేహితుడా! నీవు దురాశకు పోయి తగిన మూల్యం చెల్లించుకున్నావు కదా!” అని అంది. ఈ కథ దురాశ ఎల్లప్పుడూ బాధను, నష్టాన్ని కలిగిస్తుందని తెలియజేస్తుంది.
