Ishan Kishan: విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్.. టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్
Ishan Kishan: టీ20 క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక ఫోర్లు బాదిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 2026లో 167 ఫోర్లు కొట్టి యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు.

Ishan Kishan: భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ పరిధిలో టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా ఈ అరుదైన ఘనత సాధించాడు. యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డులను చెరిపేస్తూ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ 27 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆరంభంలోనే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఆదుకున్నాడు. అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ సాధించగా, వీరిద్దరూ మూడో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలోనే పూర్తి చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జైస్వాల్‌ను దాటేసిన కిషన్
ఈ ఏడాది 2026లో ఇషాన్ కిషన్ ఇప్పటివరకు టీ20ల్లో ఏకంగా 167 ఫోర్లు బాదాడు. ఇందులో ఐపీఎల్ 2026 సీజన్‌లో కొట్టిన 107 ఫోర్లు, అంతర్జాతీయ టీ20ల్లో సాధించిన 60 ఫోర్లు ఉన్నాయి. గతంలో 2023 క్యాలెండర్ ఇయర్‌లో యశస్వి జైస్వాల్ 165 ఫోర్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు కిషన్ అతడిని దాటేశాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ (2025లో 158 ఫోర్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ (2016లో 153 ఫోర్లు) నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ (2022లో 133 ఫోర్లు) ఐదో స్థానంలో ఉన్నారు.
ఒకే ఏడాది అత్యధిక టీ20 పరుగులు
కేవలం ఫోర్లు మాత్రమే కాకుండా ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గానూ ఇషాన్ రికార్డు సృష్టించాడు. 2026లో ఆడిన 45 మ్యాచ్‌ల్లో కిషన్ ఏకంగా 1644 పరుగులు సాధించాడు. 2016లో విరాట్ కోహ్లీ చేసిన 1614 పరుగుల రికార్డును కిషన్ దాటేశాడు. మూడో స్థానంలో అభిషేక్ శర్మ (2025లో 1602 పరుగులు), నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503 పరుగులు) ఉన్నారు.
రాంచీ పోరుపై అందరి చూపు
ఐపీఎల్, జాతీయ జట్టు రెండింట్లోనూ నిలకడగా రాణిస్తూ ఇషాన్ కిషన్ గోల్డెన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లక్నో విజయం తర్వాత ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం రాంచీలో జరగనున్న రెండో టీ20లోనూ కిషన్ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
