కావాల్సిన పదార్థాలు: పావుకిలో మినపప్పు, ఒక చిన్న అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు: సన్నగా తరిగినది, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను తీసుకోవాలి. ముందుగా, పావు కిలో మినప్పప్పును తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. పప్పు బాగా నానితేనే గారెలు మెత్తగా వస్తాయి. నానిన తర్వాత పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పప్పును నీళ్లు లేకుండా గ్రైండర్‌లో వేయాలి. గారెల పిండిని గట్టిగా రుబ్బుకోవాలి కాబట్టి, అవసరాన్ని బట్టి చాలా తక్కువ నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా, ఇడ్లీ పిండి కంటే గట్టిగా ఉండాలి. గ్రైండర్‌లో పిండి రుబ్బుతున్నప్పుడు మధ్యమధ్యలో చేత్తో కలుపుతూ ఉండాలి, దీనివల్ల పప్పు సమానంగా నలిగి పిండి గుల్లగా వస్తుంది. సగం పైన నలిగిన తర్వాత, పిండికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల గారెలు గుల్లగా రావడమే కాకుండా, పిండి కాస్త పల్చబడుతుంది కాబట్టి నీటిని జాగ్రత్తగా పోయాలి. పిండి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కొద్దిగా పలుకులా ఉండాలి.