మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల ఆస్తులు గుర్తింపు!
మోయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న గుండు వాణిపై తెలంగాణ ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. నవంబర్ 16న ఆమె నివాసం, కార్యాలయంతో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులను గుర్తించింది. అత్తాపూర్‌లో ఫ్లాట్, రెండు అంతస్తుల భవనం, వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు, వాహనాలు, షేర్లలో పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ.75 వేల లంచం కేసులో అరెస్టయిన ఆమె ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా గుర్తించిన ఆస్తులపై ఏసీబీ మరింత విచారణ చేపట్టింది..

మోయినాబాద్, నవంబర్ 17: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక చర్య చేపట్టింది. మోయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. సోమవారం (నవంబర్ 16) ఆమె నివాసంతో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. గుండు వాణి తన ప్రభుత్వ ఉద్యోగ విధుల్లో అవినీతి పద్ధతులకు పాల్పడుతూ, తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు సంబంధించిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఏసీబీ తనిఖీల్లో పలు స్థిరాస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
గుర్తించిన స్థిరాస్తుల వివరాలు ఇవే..
- మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ఓపెన్ ప్లాట్లు.
- జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల స్థలం.
- అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన నివాస ఫ్లాట్.
- అత్తాపూర్‌లో సుమారు రూ.2.45 కోట్ల విలువైన రెండు అంతస్తుల నివాస భవనం.
- మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి.
ఈ స్థిరాస్తుల అధికారిక విలువ సుమారు రూ.87.67 లక్షలుగా అంచనా వేశారు. అయితే వీటి మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. తనిఖీల్లో నగదు, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఇతర పెట్టుబడులను కూడా అధికారులు గుర్తించారు.
- నగదు: రూ.5.47 లక్షలు
- తుల్జా భవానీ వైన్స్‌లో పెట్టుబడి: రూ.50 లక్షలు
- షేర్లలో పెట్టుబడులు: రూ.1.30 కోట్లు
- బ్యాంకు ఖాతాల్లో నిల్వలు: రూ.7.97 లక్షలు
- 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు: రూ.2.54 లక్షలు
- వాహనాల విలువ: రూ.50 లక్షలు
- గృహోపకరణాల విలువ: రూ.5.10 లక్షలు
మొత్తంగా సుమారు రూ.6.76 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. గుండు వాణిని ఏసీబీ అధికారులు గత సెప్టెంబర్ 30న లంచం కేసులో అరెస్టు చేశారు. పంచాయతీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు రావడంతో ట్రాప్ నిర్వహించి ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గుర్తించిన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణలో భాగంగా గుండు వాణిని హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్‌పై హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది.




