ఇంట్లో మూడు రోజులుగా మకాం వేసిన ఎలుగుబంటి.. రెస్క్యూ ఆపరేషన్‌లో షాకింగ్ సీన్..ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో ఒక ఎలుగుబంటి చేసిన హల్‌చల్ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సింఘోలా గ్రామంలోని ఒక ఖాళీ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటి, ఎవరికీ తెలియకుండా మూడు రోజుల పాటు అక్కడే తిష్ట వేసింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలోకి పంపేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఇంట్లో నుండి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఎలుగుబంటి డిప్యూటీ రేంజర్ నీలకంఠ్ సాహుపై దాడికి యత్నించింది.

వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు అటవీ శాఖ అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ సరైన రక్షణ పరికరాలు లేకుండా ఒక ఎలుగుబంటిని బంధించేందుకు వెళ్లిన అటవీ అధికారికి ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా సింఘోలా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
సింఘోలా గ్రామానికి చెందిన ధర్మురామ్ కుల్దీప్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. రెండు మూడు రోజుల క్రితం ఒక ఎలుగుబంటి ఆ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో ఎవరూ నివాసం ఉండకపోవడంతో ఎలుగుబంటి లోపల ఉన్న విషయాన్ని గ్రామస్థులు గమనించలేదు. అయితే ఇంట్లో నుండి శబ్దాలు రావడం, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా లోపల ఎలుగుబంటి కనిపించింది.
వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పటేలి, మంగళ్‌తరాయ్ సర్కిల్‌కు చెందిన అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు.
డిప్యూటీ రేంజర్‌పై మెరుపు దాడి
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇంట్లో దాక్కున్న ఎలుగుబంటి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి అక్కడే ఉన్న డిప్యూటీ రేంజర్ నీలకంఠ్ సాహుపైకి దాడికి దూకింది. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే రేంజర్ సాహు వెంటనే అప్రమత్తమై వెనక్కి తగ్గడంతో తృటిలో పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఎలుగుబంటి ఇంట్లోని నేలను తవ్వేసి, అక్కడున్న సామాన్లను ధ్వంసం చేసింది.
छत्तीसगढ़ के बालोद में भालू का हमला!
सिंहौला गांव में डिप्टी रेंजर नीलकंठ साहू पर अचानक भालू ने हमला कर दिया। स्थिति बिगड़ती, उससे पहले ही ग्रामीणों ने सूझबूझ और हिम्मत दिखाते हुए उन्हें बचा लिया। वहीं, वन विभाग की टीम मौके पर पहुंचकर भालू को सुरक्षित पकड़ने और रेस्क्यू करने में जुटी !
— @p2- चंद्रवंशी 🇮🇳 (@pra1366) November 16, 2026
ఉన్నతాధికారుల ఆగ్రహం
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అటవీ శాఖ సిబ్బంది భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. ఎలాంటి యూనిఫాం, కనీస రక్షణ పరికరాలు లేకుండానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంపై డీఎఫ్ఓ (DFO) అభిషేక్ అగర్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించనందుకు డిప్యూటీ రేంజర్ నీలకంఠ్ సాహుకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా నివసిస్తుండి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.




