AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న 12 మంది.. 139 కి.మీ ప్రయాణానికి రూ.36 వేల జరిమానా!

సాధారణ రైళ్లలో అయితే రైలు కదులుతున్నప్పుడు కూడా ప్లాట్‌ఫామ్‌పైకి దూకేయవచ్చు. కానీ అత్యాధునిక సౌకర్యాలున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఈ విషయం తెలియక, లేదా నిర్లక్ష్యం కారణంగా తమ బంధువులను రైలు ఎక్కించడానికి లోపలికి వెళ్లిన 12 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 139 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రూ.36,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అసలేం జరిగింది?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న 12 మంది.. 139 కి.మీ ప్రయాణానికి రూ.36 వేల జరిమానా!
Vande Bharat Express
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2026 | 8:17 AM

Share

కుటుంబ సభ్యులను రైలు ఎక్కించడానికి వెళ్లిన 12 మందికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని షాక్ తగిలింది. వారణాసి నుండి న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22415) ఆదివారం కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలుకు ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ తర్వాత నేరుగా న్యూఢిల్లీలోనే స్టాప్ ఉంటుంది. కాన్పూర్ స్టేషన్‌లో తమ కుటుంబ సభ్యులు, బంధువులను సీట్ల వద్ద కూర్చోబెట్టడానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన 12 మంది కోచ్ లోపలికి వెళ్లారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

వీరు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే సమయం ముగియడంతో వందే భారత్ ఆటోమేటిక్ తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. రైలు వేగం పుంజుకోవడంతో లోపల ఉన్న 12 మంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమను కిందకు దించాలంటూ రైలు సిబ్బందిని వేడుకున్నారు. కానీ సాంకేతిక నిబంధనల ప్రకారం, స్టాప్ లేని చోట ఆటోమేటిక్ తలుపులు తెరుచుకోవని సిబ్బంది స్పష్టం చేశారు.

ఇటావా జంక్షన్‌లో అత్యవసర నిలుపుదల

లోపల చిక్కుకున్న వారి ఆందోళన ఎక్కువవడంతో రైలు సిబ్బంది వెంటనే తుండ్లా రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 10:49 గంటల సమయంలో ఇటావా జంక్షన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. స్టేషన్ సూపరింటెండెంట్, ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) పోలీసులు అక్కడికి చేరుకుని ఆ 12 మందిని సురక్షితంగా కిందకు దించారు.

ఇవి కూడా చదవండి

భారీ జరిమానా వసూలు

టికెట్ లేకుండా రైలులోకి ప్రవేశించడం, రైల్వే నిబంధనలను ఉల్లంఘించడంపై కమర్షియల్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాన్పూర్ నుండి ఇటావా వరకు ఉన్న 139 కిలోమీటర్ల దూరానికి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున 12 మందికి కలిపి మొత్తం రూ.36,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం చేయవద్దని గట్టిగా హెచ్చరించి వారిని విడిచిపెట్టారు. వందే భారత్ వంటి రైళ్లలో ప్రయాణించేటప్పుడు లేదా బంధువులను సాగనంపేటప్పుడు ఆటోమేటిక్ తలుపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us