దారుణం.. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్న తల్లి..10వ అంతస్తు నుంచి పడిపోయిన కవల పిల్లలు..
Facebook Effect: ఫేస్‌బుక్ వ్యామోహంలో మునిగిన తల్లివల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అర్దాంతరంగా గాల్లో కలిసాయి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె అదే పిచ్చిలో

Facebook Effect: ఫేస్‌బుక్ వ్యామోహంలో మునిగిన తల్లివల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అర్దాంతరంగా గాల్లో కలిసాయి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె అదే పిచ్చిలో ఉండటం గమనార్హం. తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరని తెలుసుకొని అప్పుడు విలపించింది. తను చేసిన తప్పెంటో తెలుసుకొని కన్నీరు కార్చింది. కానీ ఏం లాభం.. అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. విషయం ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలు కవలల కూడా. రొమేనియాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది.
రొమేనియాలోని ప్లోయిస్టి నగరంలో ఉంటున్న ఆండ్రియా అనే మహిళ తన ఇంట్లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉంది. ఈ సమయంలో ఆమె కవల పిల్లలు ఆడుకుంటూ10 వ అంతస్తు నుంచి కింద పడ్డారు. అయినా ఆండ్రియా లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉండిపోయింది. పిల్లల గురించి పట్టించుకోలేదు. వాళ్లు పడిపోయారని కూడా ఆమె గ్రహించలేదు. పిల్లల అరుపులు కూడా తను వినలేదు. మొత్తం ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో మునిగిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెళ్లి చెప్పే వరకు కూడా ఆండ్రియా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షంగా చాట్ చేస్తోంది. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె తనకు ఏమి తెలియదని, తాను అమాయకురాలినని బుకాయించింది. ఆ సమయంలో తాను పెద్ద కుమారుడితో వేరే గదిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ పిల్లలు కిటికీ ఎక్కలేరని ఆమె చెప్పింది. అయితే పిల్లలు కిటికీ ఎక్కడం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆండ్రియా స్నేహితురాలు మాత్రం ఆమెపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంటుంది. ఆమె పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేదని చెబుతోంది. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదని ఆండ్రియా అంటోంది. అయితే ఈ సంఘటన తర్వాత ఆమెను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు.