Viral: తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన ఆ ఊరి జనం
మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో 800 ఏళ్ల నాటి శివాలయం వెలుగుచూసింది. పాండ్య రాజవంశపు ప్రత్యేక శైలిలో నిర్మించిన ఈ ఆలయం.. మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనాకాలం నాటిదని నిపుణులు నిర్ధారించారు. తెన్నవన్ ఈశ్వరమ్ పేరుతో ప్రసిద్ధమైన ఈ టెంపుల్ ప్రాచీన శాసనాలతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారి విగ్రహాలను కలిగి ఉంది.

తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో జరిగిన సాధారణ తవ్వకాల సందర్భంగా 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. ఈ ఆలయం, గత కొన్ని శతాబ్దాలుగా నేలమట్టంలో దాగివుంది.
ఈ చారిత్రక ఆలయం బయటపడిన విషయం తెలియడంతో.. దేవి ఆర్కియాలాజికల్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అరివుసెల్వం నేతృత్వంలోని శిల్ప విభాగం నిపుణులు సమగ్ర పరిశోధన చేపట్టారు. వారి అధ్యయనాల్లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆలయంలోని శిల్పాలు, శాసనాలను పరిశీలించగా.. ఈ టెంపుల్ మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనా కాలం నాటిదని.. ముఖ్యంగా 1217-1218 AD మధ్యకాలం నాటిదని నిర్ధారణకు వచ్చారు. శాసనాల్లో ఈ ఆలయానికి ‘తెన్నవన్ ఈశ్వరమ్’ అని పేరు పెట్టినట్లు తేలింది. ఉదనపట్టీ గ్రామానికి ఆ కాలంలో ‘అత్తూరు’ అని పిలిచేవారని తేల్చారు.
పాండ్యుల రాజవంశపు ప్రత్యేక శైలి ఈ ఆలయ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాల అమరిక, శిల్పాలు, కట్టడపు నిర్మాణం ఆ కాలానికి చెందిన చారిత్రక విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి.
ఈ చారిత్రక ఆలయం గురించి తెలియడంతో.. స్థానికులు, భక్తులు భారీగా సందర్శనకు వస్తున్నాయి. ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో మునిగిపోతున్నారు. తమిళనాడు సంపదగా నిలిచిన ఆలయ వారసత్వానికి ఈ శివాలయం చక్కని ఉదాహారణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ప్రాంతంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Ancient Temple
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
