AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయానికి శ్రీకారం చుట్టిన నేల.. మిడ్జిల్‌లో సీఎం రేవంత్ భావోద్వేగ పర్యటన..!

ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మిడ్జిల్‌ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి చేరుకోనున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయానికి శ్రీకారం చుట్టిన నేల.. మిడ్జిల్‌లో సీఎం రేవంత్ భావోద్వేగ పర్యటన..!
Zptc To Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Jul 02, 2026 | 7:16 AM

Share

ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మిడ్జిల్‌ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి చేరుకోనున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

తొలి అడుగు నుంచి సీఎం పదవి వరకు..

2006లో మిడ్జిల్‌ జడ్పీటీసీగా గెలవడంతో రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధి జీవితానికి నాంది పలికింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్‌ ఎమ్మెల్యేగా, మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడిగా, కొడంగల్‌ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయంగా ఎదిగారు. ఈ ప్రయాణానికి పునాది వేసిన మిడ్జిల్‌ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పాలని సీఎం నిర్ణయించారు.

రాజకీయ జన్మనిచ్చిన నేలతో భావోద్వేగ అనుబంధం

తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దిన ప్రాంతంగా మిడ్జిల్‌ను సీఎం తరచూ ప్రస్తావిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు, చదువుకున్న పాఠశాల, దర్శించుకున్న దేవాలయం, తొలి విజయం అందించిన ప్రజలు తన జీవితంలో విడదీయరాని భాగమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అనుబంధంతో ఈ కార్యక్రమాన్ని కేవలం రాజకీయ సభగా కాకుండా కృతజ్ఞతా సభగా నిర్వహించాలని నిర్ణయించారు.

సీఎం షెడ్యూల్ ఇదే..!

మిడ్జిల్‌ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనుచరులు, గ్రామ పెద్దలు, ఆత్మీయులతో మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. తర్వాత గోపాల్‌రెడ్డి, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించి, మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

స్వతంత్ర నాయకుడిగా ప్రారంభమైన ప్రయాణం

విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై చురుకుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థిగా అడుగుపెట్టారు. మిడ్జిల్‌ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి కొడంగల్‌ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

భావోద్వేగానికి వేదిక కానున్న మిడ్జిల్

ఇరవై ఏళ్ల ప్రజా ప్రస్థానానికి ఆరంభమైన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తుండటం రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి విజయం అందించిన ప్రజల ఆశీర్వాదమే తనను రాష్ట్ర సేవ చేసే స్థాయికి తీసుకొచ్చిందనే భావనతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us