
పుష్యమాసం వచ్చిదంటే చాలు ఆ గ్రామాలు భక్తిభావంతో పులకించిపోతాయి. ఊరు ఊరంతా నియమ నిష్టలతోసాగుతాయి. ఈ మాసంలో ఊరిలో ఉన్న గ్రామస్తులేకాదు అతిథిలు సైతం ఆ ఊరుకట్టుబాట్లు పాటించి తీరాల్సిందే. లేదంటే ఆ గ్రామాల్లోకి అనుమతి లభించిందు. ఆ కట్టు బాట్లు ఆ నియమ నిష్టలు తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే. ప్రకృతిని పూజించే ఆచారం, కొండా కోనల్లో జీవనం, అడవే జీవనాధారం.. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల జీవనవిధానం. కట్టుబొట్టు, పూజలు, పండుగలు, జాతరలు తీరొక్కటి ప్రత్యేకమే. పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. నియమనిష్టలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. పుష్యమాసంలో ఆదివాసీ జాతరలకు అయితే లెక్కేలేదు. గిరిజన కుంభమేళగా సాగే నాగోబా జాతర, ఆరు రాష్ట్రాల ఆదివాసీలను ఒక్కటి చేసే జంగుబాయి జాతర, తొడసం వంశీయుల నూనె సేవనం.. ఇలా అన్నీ ప్రత్యేకమే.
ఈనెల 22న ప్రారంభమైన పుష్యమాసం వచ్చే నెల 22 వరకు సాగనుంది. ఈ నెల రోజుల పాటు ఆదివాసీ గ్రామాల్లో కఠిన నిబందనలు అమలవుతాయి. ఈ నెల రోజులు ఆదివాసీలు చెప్పులు దరించరు.. పాదరక్షలు ధరించ కుండా నే కారడివిలో సంచరిస్తారు. ఈ నిబందనలు గిరిజనం ఆచరించడమే కాదు అతిధులుగా తమ గ్రామాల్లోకి వచ్చే వారు సైతం ఆచరించి తీరాల్సిందే అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదివాసీ గూడాల్లో ఇదిగో ఇలా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మా ఊర్లోకి అడుగు పెట్టాలంటే చెప్పులు వదిలేయాల్సిందే. లేదంటే రూ.5వేల జరిమానా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఆదివాసీలు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడ గ్రామస్తులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన ఓ బోర్డును ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విచిడి పెట్టాలని, చెప్పులు ధరించి మా ఊరి లోపలికి వస్తే 5 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈనెల 22 నుండి వచ్చే నెల 22 వరకు ఈ ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఒక్క తుమ్మగూడాలోనే కాదు ఆదిలాబాద్ లోని మూడు వందలకు పైగా గ్రామాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయి. ఈ పుష్యమాసం పూర్తయ్యేంత వరకు ఆదివాసీ గ్రామాల్లోకి రావాలంటే మా ఆచారాలు, నియమ నింబదనలు పాటించాల్సిందే అని చెప్తున్నారు ఆదివాసీ పెద్దలు. తరతరాల ఆచారాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్న ఆదివాసీల విధానం హర్షణీయం అంటోంది పట్టణ జనం.