వరంగల్‌లో యువ జర్నలిస్ట్ బలవన్మరణం యావత్ జర్నలిస్టు లోకాన్ని కలచివేసింది. జర్నలిజమే జీవితం.. ప్రశ్నించడమే తన నైజంగా ఎంచుకున్న ఆ యువ జర్నలిస్టు తన కూతురితో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆ జర్నలిస్టు బలవన్మరణం అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. చివరి దశలో కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి గూడు కూడా లేకపోవడం, ఇంటి యజమాని తన ఇంట్లో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పడం జర్నలిస్టుల హృదయాలను తల్లడిల్లిపోయేలా చేసింది.
ఆ ఇద్దరి మరణం అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఆర్థిక ఇబ్బందులే కారణమా..? వృత్తి పరంగా మానసిక సంఘర్షణ అతని ప్రాణాలు బలితీసుకుందా..? లేక తాను ఎంచుకున్న దారే తప్పని కూతురుతో సహా తనువు చాలించాడా..? యువ జర్నలిస్టు యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య కు పాల్పడడం సమాధానం లేని ప్రశ్నగా మారింది.
గత పదేళ్ళుగా వరంగల్ జిల్లాలో వివిధ ఛానళ్లలో పని చేస్తున్న యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి అలియాస్ యోగానందరెడ్డి తనువు చాలించాడు. తన కూతురు ఆద్యారెడ్డితో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం(ఆగస్ట్9) సాయంత్రం బాలసముద్రం ప్రాంతంలోని తన వ్యక్తిగత కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఆద్యారెడ్డికి ఉరివేసి తను కూడా అదే చీరతో మెడకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గతంలో ఓ శాటిలైట్ చానల్‌లో ఓబి డ్రైవర్‌గా, టెక్నీషియన్‌గా పనిచేసిన యోగిరెడ్డి ఆ తర్వాత తన వాక్చాతుర్యంతో ఓ యూట్యూబ్ ఛానల్‌లో పనిచేశాడు. నికార్సయినా జర్నలిస్టుగా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. హఠాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలచివేసింది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదు. అతని సెల్‌ఫోన్ స్వాదీనం చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
అయితే యోగి రెడ్డి అంతిమ సంస్కారాలు జర్నలిస్టుల కుటుంబాలను తల్లడిల్లిపోయెలా చేసింది. హనుమకొండలో 15 ఏళ్లకు పైగా ఉంటున్న యోగిరెడ్డికి కనీసం ఇల్లు లేదు. స్వప్న అనే నిరుపేద యువతిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు. తన కూతురు ఆదిత్యరెడ్డి ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తన ఆశయాలకు తగ్గట్టే కూతుర్ని కూడా తీర్చిదిద్దుకున్న యోగి రెడ్డి తనతో పాట తీసుకెళ్లాడు. కొద్ది రోజులుగా తాను పని చేస్తున్న యూ ట్యూబ్ చానెల్ లో కూడా పని చేయడం లేదని సమాచారం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఆత్మాభిమానం తనను కుంగిపోయేలా చేసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావిస్తున్నారు.
అయితే యోగి అంతిమ సంస్కారాలు జర్నలిస్టు లోకాన్ని కలచివేసింది. అద్దె ఇంటి యజమాని అంత్యక్రియలు సందర్భంగా తన ఇంట్లో శుభకార్యము ఉన్న నేపథ్యంలో డెడ్ బాడీని ఇంటికి తీసుకు రావద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. తన స్వగ్రామం వనపర్తిలో కూడా ఆయనకు ఇల్లు లేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబానికి దూరంగా ఉంటున్న యోగిరెడ్డి అంత్యక్రియలు ఎక్కడ చేయాలని అంతా ఆయోమయానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తన తల్లి, సోదరి, భార్య అంతా కలిసి జనగామకు తీసుకెల్లి తన సోదరి ఇంటి వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అందరితో కలిసిమెలిసి ఆప్యాయంగా ఇంట్లో ఒకరిగా నడుచుకున్న యోగిరెడ్డి మరణవార్త ప్రతి ఒక్కరిని తల్లడిల్లిపోయేలా చేసింది. అన్ని తానే అనుకొని యోగిరెడ్డి జీవితంలో పాలుపంచుకుంటున్న అతని సహచరిని స్వప్న గుండెలు అవిసెల తల్లడిల్లిపోతుంది. వృత్తిరీత్యా యాక్టివ్‌గా పనిచేసిన యోగి హఠాత్తుగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడంలేదని తల్లి పోతుంది. యోగి మరణం జర్నలిస్టులోకాన్ని, స్థానికులను కలచిచేసింది.. జర్నలిజాన్ని ఫ్యాషన్ గా ఎంచుకుని ఈ వృత్తిలోకి అడుగుపెట్టే వారికి ఈ ఆత్మహత్య ఓ గుణపాఠం కావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు.
ఇళ్ళ్ళు లేక పోవడంతో చివరి దశలో కనీసం సొంత ఇంటి వద్ద అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో యోగిరెడ్డి డెడ్ బాడీని కొంతసేపు హనుమకొండ లోని ప్రెస్ క్లబ్ లో ఉంచి అక్కడి నుండి జనగామకు తరలించారు. ప్రభుత్వాలు – పాలకులు మారిన జర్నలిస్టుల సొంత ఇంటి కల దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి జర్నలిస్టులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని, ఇలాంటి దుస్థితి మరో జర్నలిస్టుకు రావద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా యువ జర్నలిస్ట్ తన కూతురితో సహా చేసుకున్న బలవన్మరణం ఇప్పుడు చర్చగా మారింది. పోలీసులు విచారణలో ఏం తేల్చుతారో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..