ములుగు, డిసెంబర్ 15: సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ సూసైడ్ కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఎస్సై బలవన్మరణానికి ఓ యువతి వేధింపులే కారణమని పోలీసులు గుర్తించారు. కిలాడీ లేడీని శనివారం అరెస్టు చేశారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్ వివరాలు వెల్లడించారు.
వాజేడు మండలం ముల్లెకట్ట వారధి సమీపంలోని ఫెరిడో రిసార్టులో డిసెంబర్ 2వ తేదీన ఉదయం ఎస్సై రుద్రారపు హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో అదే రోజు అక్కడకు వచ్చిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోతు అనసూర్య అలియాస్ అనూషపై అనుమానం కలిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
అనూష హైదరాబాద్‌లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా పనిచేస్తోంది. 7 నెలల కిందట రాంగ్ కాల్ ద్వారా ఎస్సై హరీశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ఎస్సై కావడంతో, ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడవచ్చని భావించింది. దీంతో తరచూ ఎస్సై హరీశ్‌కు ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంటూ పెళ్లికి ఒప్పించాలని పన్నాగం పన్నింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని హరీశ్‌పై ఒత్తిడి తెసుకొచ్చింది. హరీశ్ యువతి ప్రతిపాదనను నిరాకరించడంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని తిరస్కరిస్తున్నట్లు మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానంటూ బెదిరించింది.
దీంతో భయాందోళనలకు గురి చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 1వ తేదీ రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్‌కు హరీశ్‌తోపాటు అనూష వెళ్లారు. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపొమ్మంటూ ఒత్తిడి చేసింది. దీంతో తీవ్ర భావోధ్వేగానికి గురైన ఎస్సై మరుసటి రోజు ఉదయం తెల్లవారు జామున ఆమెను బయటకు పంపి, హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు అనూషను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అనూషను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.