Khammam Nelakondapally: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబం వినూత్నంగా నిరసనకు దిగింది. తమ భూమిని ఇతరుల పేరున రికార్డుల్లోకి ఎక్కించారంటూ తహశీల్దార్ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. మంచం, దుప్పట్లు అన్నీ తీసుకుని వచ్చి, తహశీల్దార్ కార్యాలయంలోనే మకాం పెట్టారు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణకు ఎకరం మూడు కుంటల భూమి ఉంది. వారసత్వంగా అది వాళ్లకు సంక్రమించింది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరున రాసేశారు రెవెన్యూ అధికారులు. దాంతో, ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలేమీ వాళ్లకు అందకుండా పోతున్నాయ్. ఉన్నదే కొద్దిపాటి భూమి, అదీ కూడా తమ పేరున లేకుండా చేయడంతో రైతుబంధులాంటి స్కీమ్ తమకు అందకుండా పోతోందని అంటోంది బాధిత కుటుంబం. ఏళ్లతరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు అరుణ పేర్కొంది.
ఎకరం పొలంపైనే ఆధారపడి తమ కుటుంబం జీవిస్తోందని, తమ భూమికి పట్టా పాస్ బుక్ ఇప్పించాలని కోరుతోంది బాధిత కుటుంబం. లేదంటే, ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ కొడుకుతో కలిసి తహశీల్దార్ ఆఫీస్ ముందే మకాం పెట్టింది అరుణ. దీంతో పోలీసులు చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..