AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్యాన్సర్‌ చికిత్సకు వెళ్తే.. కిడ్నీ మాయం..

క్యాన్సర్‌ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది.. కానీ ఆపరేషన్‌ తర్వాత ఊహించని షాక్‌ ఎదురైంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో మరో ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించగా.. ఒక్కటే కిడ్నీ ఉందని తేలింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు రెండో కిడ్నీ ఏమైంది? ఎప్పుడు తొలగించారు?

Telangana: క్యాన్సర్‌ చికిత్సకు వెళ్తే.. కిడ్నీ మాయం..
Missing Kidney
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 12:45 PM

Share

యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన తాళ్లపల్లి కమలమ్మ గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆలేరులోని అర్పిత నర్సింగ్‌హోమ్‌ను ఆశ్రయించారు. నర్సింగ్‌ హోమ్ నిర్వాహకుడు డాక్టర్ ప్రభాకర్.. హైదరాబాద్‌కు చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్‌ను రప్పించి కమలమ్మకు శస్త్రచికిత్స చేశారు. అయితే.. ఆపరేషన్ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించారు. స్కానింగ్‌లో ఒక్కటే కిడ్నీ కనిపించడంతో కుటుంబం షాక్‌కు గురైంది. తమకు జరిగిన విషయంపై నర్సింగ్‌హోమ్ వైద్యులను కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గర్భసంచి చుట్టూ కొవ్వు పేరుకుపోయిందని, దానికి ఉన్న క్యాన్సర్ గడ్డలను తొలగించే క్రమంలో కిడ్నీ కోతకు గురైందని వివరించారు.

పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు..

అయితే.. నర్సింగ్‌హోమ్ వైద్యుల వివరణతో బాధిత కుటుంబం సంతృప్తి చెందలేదు. కిడ్నీ తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అలా చేయాల్సి వస్తే ముందుగా తమ కుటుంబానికి సమాచారం ఎందుకు ఇవ్వలేదని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఆపరేషన్‌కు ముందు, తర్వాత వైద్య రికార్డుల్లో ఏం నమోదైందనే వివరాల కోసం బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కుమారుడు కుమార్.. ఆలేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నర్సింగ్‌హోమ్ నిర్వాహకుడు డాక్టర్ ప్రభాకర్‌తో పాటు ఆపరేషన్ చేసిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మహేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

నర్సింగ్‌హోమ్‌ను సీజ్ ..

ఈ ఘనపై రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు అర్పిత నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకున్నారు. డీఎంహెచ్‌ఓ నేతృత్వంలో ప్రత్యేక బృందం నర్సింగ్‌ హోమ్‌లో విచారణ చేపట్టింది. బాధితురాలి వైద్య రికార్డులు, శస్త్రచికిత్స వివరాలు, ఆస్పత్రి అనుమతులు, సంబంధిత వైద్యుల పాత్ర వంటి అంశాలను పరిశీలించారు. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు కొత్త ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ కేసులను నమోదు చేయొద్దని ఆదేశించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులను డిశ్చార్జ్ చేసి అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించాలని సూచించారు.

మరోవైపు.. డీఎంఈ పర్యవేక్షణలో ఈ వ్యవహారం రాష్ట్రస్థాయికి చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాన్సర్‌కు చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళకు.. కిడ్నీ తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నిజంగా శస్త్రచికిత్సలో అనుకోకుండా జరిగిన వైద్య సమస్యా?లేక వైద్య నిర్లక్ష్యమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీని వెనక కిడ్నీ రాకెట్ ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us