
హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనీకి చెందిన యువతి.. తన ప్రియుడిని తెచ్చివ్వాలంటూ బాచుపల్లిలో హల్‌చల్ చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మణికొండకు చెందిన ఓ యువతి.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే గతకొంత కాలంగా బాచుపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఆ యువకుడి ఇంటికి వెళ్లిన సదరు యువతి.. తనను వివాహం చేసుకోవాలంటూ గొడవ చేసింది. అయితే ఆ సమయంలో ఆ యువకుడు లేకపోవడంతో అతని తల్లిదండ్రులు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో సదరు యువతితో పాటుగా ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పీఎస్‌కు తీసుకోచ్చి విచారించారు. ఈ క్రమంలో సదరు యువతి పీఎస్‌లో హల్‌చల్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుడా అరుస్తూ. తన బాయ్‌ఫ్రెండ్‌ను తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు షీ టీమ్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. అనంతరం ఆ యువతికి షీ టీమ్స్ బృందం సర్ధిచెప్పింది. కాగా, గతంలో కూడా ఈ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కూడా ఇలానే ప్రవర్తించిందని.. అక్కడ కూడా యువకుడిపై కంప్లైంట్ చేయమంటే చేయలేదని పోలీసులు అంటున్నారు.