జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తాం.. పేపర్ లీకేజీపై బీజీపీ సంచలన నిర్ణయం

టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే.

జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తాం.. పేపర్ లీకేజీపై బీజీపీ సంచలన నిర్ణయం
Bjp Flag

Updated on: Mar 22, 2023 | 1:28 PM

టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై బీజీపీ తమ రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా ఈ లీకేజీ వ్యవహారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. పరీక్షలు రాసిన అభ్యర్థుల దగ్గరికెళ్లడం, యూనివర్సిటీల సందర్శించడం,లీకేజీ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ వంటివి చేపట్టేలా కార్యాచరణను రూపొందిస్తోంది. వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా లీకేజీ వ్యవహారంపై ప్రజా స్పందనను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను, వారి తల్లితండ్రుల దృష్టిని ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.ఇప్పటికే లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ, బీజేవైఎం, ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలతో వివిధ వర్గాల ప్రజల్లో మంచి మైలేజీ వచ్చిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో పాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణ, తదితర పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రులు, అధికారపార్టీ నేతల తీరును ఎండగట్టేలా నిరసన, ఆందోళన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని నిర్ణయించింది.

పేపర్‌ లీకేజీ వ్యవహారంపై టీఎస్‌పీఎస్‌సీ పర్యవేక్షణ, నిర్వహణా వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో తాము ముందున్నామని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల కంటే ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయడంలో విజయం సాధించామని బీజేపీ ముఖ్యనేత తెలిపారు.టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ తీరు, లోటుపాట్లను ఎత్తిచూపి, తమ పార్టీకి అనుకూలంగా ప్రజల మద్దతును రాబట్టుకోగలిగామని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ముందువరసలో నిలవగలిగామని ఆ నేత అభిప్రాయపడ్డారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..