
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మద్యం తరలింపు కలకలం రేపుతోంది. పట్టణంలోని ఓ హోటల్ వద్ద జాతీయ రహదారి 44పై వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు జీఎస్టీ అధికారులు. ఇంతలో ఓ డీసీఎం వాహనాన్ని నిలిపి సోదాలు చేశారు. మద్యంతో కూడిన కాటన్ బాక్సులు దర్శనమిచ్చాయి. దీన్ని చూసిన అధికారులు అవాక్కయ్యారు. రూ .10లక్షల విలువైన 550కాటన్ల మద్యంను గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో యధేచ్ఛగా తరలిస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. వాహనం డ్రైవర్‌ని ఆరా తీశారు. మద్యం తరలింపునకు సంబంధించిన బిల్లులు అడిగారు. వెనకాల మద్యం లోడుకు చెందిన వ్యక్తులు వస్తున్నారని చెప్పడంతో వాహనాన్ని పక్కకు నిలిపివేశారు.
ఇంతలోనే విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు. అధికారుల వద్దకు చేరుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. తమ వాహనాలను ఆపడానికి మీరెవరు అంటూ చెలరేగిపోయారు. అధికారుల మొబైల్ ఫోన్లు లాగేసుకున్నారు. సోదాలు జరుపుతున్న క్రమంలో తీసిన వీడియోలు, ఫోటోలను తొలగించారు. గుర్తుతెలియని వ్యక్తులంతా చుట్టుముట్టి డీసీఎం వాహనాన్ని ముందుకు తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మద్యం ఎవరిదో తెల్చేపనిలో ఉన్నారు.
మద్యం పట్టివేత సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై జీఎస్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల మొబైల్ ఫోన్లు లాక్కొని, తనిఖీల వీడియోలు తొలగించి, వాహనాన్ని తీసుకెళ్ళిన అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, మొబైల్ ఫోన్లు లాక్కున్నారని జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ స్టేట్ టాక్స్ కమిషనర్ అశోక్ కుమార్ కంప్లైంట్ చేశారు. తన నెంబర్ తీసుకొని ఓ వ్యక్తి మిస్డ్ కాల్ ఇచ్చాడని ఆ నంబర్‌ను సైతం ట్రేస్ చేయాలని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..