AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం.. తిరుగువారం పండుగ అంటే ఏంటి..! ఆదివాసులు ఏం చేస్తారో తెలుసా…?

Medaram Thiruguvaaram Pandaga: జాతర ముగిసిన తర్వాత సరిగ్గా వారం రోజులకు మళ్లీ బుధవారం నిర్వహించే వేడుకను తిరుగు వారం పండుగ అంటారు. తిరుగువారం పండుగరోజు గద్దెల ప్రాంగణంతో పాటు సమ్మక్క, సారక్క గుడి.. అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు.. ఆదివాసి పూజారులు సమ్మక్క సారక్క గుడిలోకి వాళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారం పూజా సామాగ్రి తీసుకువెళ్లి వనదేవతలకు పూజలు చేస్తారు. ఆ దేవతలకు ప్రీతికరమైన నైవేద్యంగా జంతుబలిస్తారు.

మేడారం.. తిరుగువారం పండుగ అంటే ఏంటి..! ఆదివాసులు ఏం చేస్తారో తెలుసా...?
Medaram Thiruguvaaram Pandaga
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 9:26 PM

Share

మేడారం మహాజాతర ముగిసింది. జాతర ముగిసిన వారం రోజుల తర్వాత నిర్వహించే తిరుగువారం వేడుక ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వనదేవతలకు జంతుబలిచ్చి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అసలు తిరుగుబారం పండుగ అంటే ఏంటి..? తిరుగువారం సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు..? తిరుగువారం పండుగలో సాధారణ భక్తులకు ప్రవేశం ఉంటుందా..? మహా జాతరకు.. తిరుగు వారం వేడుకకు తేడా ఏంటి..?

మండమెలిగేతో మొదలు

మేడారం మహా జాతరకు వారం రోజులు ముందు నిర్వహించే వేడుకను మండమెలిగే పండుగ అంటారు. మెలిగే పండుగ అంటే మేడారం చుట్టూ కట్టడిచేసి కోడి పిల్లను ఊరి పొలిమేరల్లో వేలాడదీసి ఊరు కట్టు చేస్తారు. ఊరు చుట్టూ తోరణాలు కట్టి ఏ దుష్టశక్తి మేడారం పొలిమేర దాటి గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేస్తారు. ఆ తర్వాత సమ్మక్క సారక్క దేవాలయాలతో పాటు గద్దెల ప్రాంగణాన్ని అలికి శుద్ధిచేసి జాతరకు అంకురార్పణ చేస్తారు..

మండమెలిగే పండుగ నిర్వహించిన వారం రోజులకు సరిగ్గా బుధవారం రోజు జాతర ఆరంభమవుతుంది. బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్క గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. నాలుగు రోజులపాటు నిర్వహించే జాతరలో భక్తజనకోటి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది.

జాతర ముగిసిన తర్వాత సరిగ్గా వారం రోజులకు మళ్లీ బుధవారం నిర్వహించే వేడుకను తిరుగు వారం పండుగ అంటారు. తిరుగువారం పండుగరోజు గద్దెల ప్రాంగణంతో పాటు సమ్మక్క, సారక్క గుడి.. అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు.. ఆదివాసి పూజారులు సమ్మక్క సారక్క గుడిలోకి వాళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారం పూజా సామాగ్రి తీసుకువెళ్లి వనదేవతలకు పూజలు చేస్తారు. ఆ దేవతలకు ప్రీతికరమైన నైవేద్యంగా జంతుబలిస్తారు.

కట్టుబాట్ల ప్రకారం వనదేవతలకు వడ్డెలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజంతా జాగరణ ఉంటారు. మహా జాతర సమయంలో తల్లుల దర్శనం వీలుపడని భక్తులు తిరుగువారం పండుకు హాజరై వనదేవతలను దర్శించుకుంటారు.. ఈసారి తిరుగువారం పండుగ సందర్భంగా సుమారు ఐదు లక్షల మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.