Etela Road shows : అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తన ఉనికిని కాపాడుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీతో 19 ఏళ్లు నడిచిన ఆయన తన రాజకీయ భవిష్యత్ గురించి తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ నేతలతో చర్చోపచర్చలు జరిపారు. ఇటీవల హస్తిన పర్యటన చేసిన ఆయన కమలం పార్టీ అగ్రనేతలతో పార్టీలో తన స్థానానికి సంబంధించి బేరసారాలు సాగించారు.. ఇక, ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. శంభునిపల్లి గ్రామంలో ఆయనకు మహిళలు మంగళహారతులతో నుదుట తిలకం దిద్ది స్వాగతం పలకగా, ఆయన అభిమానులు జై ఈటెల.. జై జై ఈటెల అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్ మీదా, టీఆర్ఎస్ పార్టీ మీదా విమర్శలు గుప్పించారు.
పార్టీలో తనకు నాలుగేళ్లుగా అవమానాలు ఎదురవుతున్నాయన్న ఈటల, ఇక ఉండలేకే టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు.. ఈ పర్యటనతో కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
హుజూరాబాద్ టూర్ సందర్భంగా మూడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించ తలపెట్టిన ఈటల. . కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి మూడు గ్రామాల ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతోన్న ఈటల.. ఈ నెల 13న బీజేపీలో చేరనున్నారు.