మిత్రుడి మరణం తీరని లోటు.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి స్నేహితులు!
చిన్న నాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి పదవ తరగతి (1999-2000 బ్యాచ్) స్నేహితులు అండగా నిలిచారు. బుధవారం మహేందర్ చిత్రపటానికి నివాళులర్పించిన మిత్రులు, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.81 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా కల్పించారు.

స్నేహం అంటే కేవలం కలిసి ఉన్నంత కాలం సరదాగా గడపడమే కాదు.. కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా వెన్నంటి నిలవడం. ఈ నిజమైన స్నేహానికి రాయపర్తి మండల కేంద్రంలో ఒక ఆదర్శవంతమైన సంఘటన నిదర్శనంగా నిలిచింది. రాయపర్తికి చెందిన మైస మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మహేందర్ అకాల మరణం ఆయన కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన పదో తరగతి (1999-2000 బ్యాచ్) స్నేహితులు ముందుకు వచ్చారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ, మిత్రుడి కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి తలా కొద్దిగా జమ చేసి రూ. 81,000 ఆర్థిక సహాయాన్ని సిద్ధం చేశారు.
దసరా పండుగ సందర్బంగా కలుసుకున్న ఆ స్నేహితులంతా పండగ అనంతరం బుధవారం రాయపర్తికి చేరుకున్నారు. ఆ మిత్రులంతా ముందుగా మైస మహేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి ఓదార్చారు. కుటుంబానికి భవిష్యత్తులోనూ తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మానవతా కార్యక్రమంలో మృతుడి మిత్రులు మునుగోటి అనిల్ కుమార్, సతీష్ కుమార్, గోలి మహేందర్ రెడ్డి, నాగమళ్ల సోమేశ్వర్, రవి ప్రసాద్, రాము, రవి తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఈ మిత్రుల గొప్ప మనసును స్థానికులు అభినందిస్తున్నారు.




