మరో కొత్తరకం దోపిడీ.. డబ్బులు లేవంటే.. మొబైల్ యాప్‌లో బలవంతంగా లోన్ ఇప్పించి మరీ దోచుకెళ్లారు!
మారుతున్న కాలంతో పాటు నేరస్థులు కూడా తమ పంథాను మార్చుకుంటున్నారు. గతంలో దొంగలు జేబులు కోయడం, ఇళ్లలో నగదు దోచుకోవడం చేసేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బాధితుడి వద్ద డబ్బులు లేకపోవడంతో, ఏకంగా లోన్ యాప్ ద్వారా అప్పు ఇప్పించి మరీ దోచుకున్న కిరాతకుల ఉదంతం కలకలం రేపుతోంది.

చెన్నైలో డిజిటల్ కాలానికి తగినట్లుగా దొంగలు తమ నేర పద్ధతులను పూర్తిగా మార్చేశారు. నగరంలో 21 ఏళ్ల యువకుడిని నలుగురు దుండగులు అపహరించి, ఆటోలో తిప్పుతూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి వద్ద ఎలాంటి నగదు లేకపోవడంతో, నిందితులు సరికొత్త నేరానికి తెరలేపారు. మొబైల్ లోన్ యాప్ ద్వారా బలవంతంగా లోన్ అప్లై చేయించి, ఆ డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేసుకున్నారు. అంతేకాకుండా అతడి ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లారు. అసలు ఏం జరిగింది?
చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల ఒక యువకుడిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని ఆటోలో ఎక్కించుకుని పల్లికరనై ప్రాంతంలో తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేశారు. తమకు వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అయితే ఆ యువకుడి వద్ద ఎలాంటి నగదు లేదు. తన దగ్గర డబ్బులు లేవని బాధితుడు ఎంత బ్రతిమిలాడినా ఆ దుండగుల మనసులు కరగలేదు. డబ్బులు లేవన్న ఒకే ఒక్క కారణంతో తమ దోపిడీ ఆలోచనను విరమించుకోని ఆ కేటుగాళ్ళు, ఒక పక్కా ప్లాన్ వేశారు.
యాప్ ద్వారా బలవంతంగా లోన్..
బాధితుడి వద్ద క్యాష్ లేకపోవడంతో, నిందితులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్షణాల వ్యవధిలో ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా బలవంతంగా అప్పుకు దరఖాస్తు చేయించారు. ఆ అప్లికేషన్ ద్వారా లోన్ మంజూరు కాగానే, బాధితుడిని వెంటబెట్టుకుని నేరుగా ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లారు. ఏటీఎం నుంచి బలవంతంగా రూ. 9,500 నగదును డ్రా చేసి కాజేసారు. అంతటితో ఆగకుండా బాధితుడి మొబైల్ ఫోన్‌ను కూడా పట్టుకెళ్లిపోయారు.
పోలీసుల ఎంట్రీ.. నలుగురి అరెస్ట్:
ఈ ఘటనపై బాధితుడు వెంటనే స్థానిక పల్లికరనై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులు సాయి అబుతాకిర్ అలియాస్ అబు (18), పూబాలన్ (23), సంజయ్ (21), ప్రకాష్ రాజ్ (22)లను పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు గాలించి ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశాయి. కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
టెక్నాలజీ మనిషి సౌలభ్యం కోసమే అయినప్పటికీ, సైబర్ నేరగాళ్లు, కేటుగాళ్ళు దానిని ఇలాంటి నేరాలకు వాడుకోవడం ఆందోళనకరమైన విషయం. అప్రమత్తంగా ఉండకపోతే ఎప్పుడూ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పలేమని ఈ ఘటనే నిరూపిస్తోంది.




