వరంగల్, జనవరి 07; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో ఓ విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది.. చివరి రోజు ఓ గ్రామంలో శివుడి పేరిట దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది.. ఆ దరఖాస్తుదారుడి వివరాలు ఆరా తీయగా.. అసలు కథ బయట పడింది..ఇంతకీ సంగతేంటంటే..
ఈ విచిత్ర సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో జరిగింది.. దరఖాస్తుల స్వీకరణకు చివరిరోజు శనివారం రోజు ఈ గ్రామానికి చెందిన ఏనుగు వెంకటసురేందర్ రెడ్డి అనేవ్యక్తి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దరఖాస్తు దారుడి పేరు శివయ్య, భార్యపేరు పార్వతీ దేవి, కుమారులు కుమారస్వామి, వినాయకుడిగా రాశాడు. అంతేకాదు దరఖాస్తు ఫామ్ మీద శివుడి ఫోటోను అంటించాడు. పుట్టిన తేదీ 12వ శతాబ్దం అని రాశాడు. అందులో మహాలక్ష్మీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు దరఖాస్తు చేసినట్లు ఉంది.. ఐతే అధికారులు దరఖాస్తు ఫారం తీసుకొని రసీదు కూడా ఇవ్వడం గమనార్హం..
ఈ దరఖాస్తు విషయమై సురేందర్ రెడ్డిని సంప్రదించగా గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోవడంలేదని, ఆలయ అభివృద్ధి కోసమే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారం ఇచ్చానని తెలిపారు.. ఎవరి ప్రోద్బలం, దురుద్దేశం కానీ లేవని, సొంత లాభాపేక్ష కోసం కాకుండా దేవాలయ అభివృద్ధి కోసమే దరఖాస్తు చేశానని తెలిపారు..
ఇక అధికారులు, ప్రభుత్వం ఈ దరఖాస్తును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి..దరకాస్తు స్వీకరించి రిసిప్ట్ ఇచ్చిన సిబ్బంది ఏం సమాధానం చెబుతారో చూడాలి…
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..